కెసిఆర్ రాజకీయ చతురత, వాక్చాతుర్యం గురించి అందరికీ తెలుసు. అది గజ్వేల్ సభలో మరొక్కమారు బయటపడింది. ఆయన ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్రమంత్రులని పొగడటానికి రాజకీయ విశ్లేషకులు రకరకాల కోణాలలో విశ్లేషించి ఉండవచ్చు. కానీ కెసిఆర్ మాత్రం తన మాటల గారడీతో ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్రమంత్రులనీ కట్టిపడేసి, తన పట్ల తన ప్రభుత్వం పట్ల వారికి ప్రత్యేక అభిమానం, ఆసక్తి కలిగేలా చేయగలిగారని ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకు ఆయన ఎంచుకొన్న బాష-హిందీ కూడా ఒక కారణమే. దాని వలన ఆయన చెప్పిన ప్రతీ ముక్క యధాతధంగా వారి హృదయాలని తాకింది.
రాష్ట్రంలో టిఆర్ఎస్-బిజెపిలు మిత్రపక్షాలు కాదు. నిత్యం విమర్శలు చేసుకొంటూనే ఉంటాయి. గజ్వేల్ సభ తరువాత వెంటనే జరిగిన హైదరాబాద్ సభలో ఆ విషయం స్పష్టం అయింది కూడా. బిజెపితో కానీ ఎన్డీయే ప్రభుత్వంతో గానీ అసలు సంబంధమే లేని ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కెసిఆర్, సభాముఖంగా, దేశప్రజలు అందరికీ అర్ధమయ్యే విధంగా హిందీలో మోడీని, కేంద్రమంత్రులని పొగుడుతుంటే అది వారికి ఎంత ఆనందం కలిగించి ఉంటుందో వారు ఎంత ప్రసన్నం అయ్యుంటారో ఊహించవచ్చు.
మోడీతో సహా కేంద్రమంత్రులు, బిజెపి నేతలు అందరూ చాలా గొప్పగా చెప్పుకొనే విషయం, తమ రెండేళ్ళ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని. అదే విషయం కెసిఆర్ ప్రస్తావించి, అందుకు మోడీని అభినందించారు. అలాగే కేంద్ర ఆదాయంలో 42 శాతం రాష్ట్రానికి పంచిపెట్టాలనే మోడీ నిర్ణయం కూడా సామాన్యమైనది కాదని మెచ్చుకొన్నారు. ఈ రెండు ముక్కలు చాలు ప్రధానిని, కేంద్రమంత్రులని ఖుష్ చేయడానికి.
ఇంతవరకు దేశంలో మరే ముఖ్యమంత్రి నోట ఆ మాట రాలేదు. కెసిఆర్ ఒక్కరే మోడీ గొప్పదనాన్ని గుర్తించి సభాముఖంగా చాటి చెప్పారు. బిజెపి నేతలో లేదా చంద్రబాబో ఆ విధంగా ప్రశంసించి ఉండి ఉంటే అదేమీ పెద్ద విశేషం కాదు. కానీ బిజెపితో, ఎన్డీయే కూటమితో సంబంధం లేని కెసిఆర్ నోట ఆ మాట వచ్చినప్పుడు దానికి చాలా విలువ ఏర్పడుతుంది. రేపు రాష్ట్రంలో బిజెపి నేతలు కూడా దాని గురించి గొప్పగా చెప్పుకోకుండా ఉండరు.
“మీకున్న సమస్యలు, పరిమితులు నేను అర్ధం చేసుకోగలను. అందుకే మాకు లక్షల కోట్లు ఇమ్మని నేను అడగను...మీ ప్రేమాభిమానాలు, ఆశీర్వాదం ఉంటే చాలు” అని కెసిఆర్ అన్నారు. బహుశః బిజెపి ముఖ్యమంత్రుల నోట కూడా అటువంటి మాట మోడీ ఎన్నడూ విని ఉండరేమో? ఆ ముక్క చాలు ఆయన వద్దన్నా లక్షల కోట్లు కురిపించడానికి.
ఇక మోడీతో వచ్చిన కేంద్రమంత్రులని కూడా కెసిఆర్ మరిచిపోలేదు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు చేసిన ఉపకారాలు, రాష్ట్రంలో కొత్తగా జాతీయ రహదారుల నిర్మాణం కోసం నితిన్ గడ్కారీ చేసిన సహాయం గురించి, విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడానికి పీయూష్ గోయల్ చేసిన సహాయాన్ని, వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయలు రాష్ట్రానికి అందిస్తున్న సహాయసహకారాల గురించి సభా ముఖంగా వివరించి, దాని వలన రాష్ట్రం ఏ విధంగా ప్రగతి సాధించిందో గణాంకాలతో సహా వివరించడంతో అందరి మనసులు తృప్తితో నిండిపోయి, చాలా సంతోషంగా ఢిల్లీకి తిరిగి వెళ్లి ఉంటారు.
తన ప్రభుత్వం గొప్పదనం గురించి, తన మంత్రుల అద్భుతమైన పనితీరు గురించి తమ రాజకీయ ప్రత్యర్ధి పార్టీకి చెందిన ఒక ముఖ్యమంత్రి నోట అంత గొప్పగా వినబడుతుంటే మోడీ గాని, ఆ మంత్రులు గాని సంతోషించకుండా ఉండగలరా? ఒక విధంగా చెప్పాలంటే వారి ప్రోగ్రస్ కార్డులో నూటికి నూటొక్క మార్కులు పడేలా కెసిఆర్ మాట్లాడారు.
“కెసిఆర్ డబ్బు అడగలేదు కానీ “నేడు తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందంటే అది మీ సహాయ సహకారాలు, ప్రోత్సాహం వలనే” అని ఎటువంటి బేషజాలు లేకుండా సభాముఖంగా చెప్పడం ద్వారా ఇకపై కేంద్రం నుంచి రెట్టింపు సహాయం పొందే అవకాశం ఉంది. ఆ నాలుగు మంచి ముక్కలు..ఆ క్రెడిట్ కోసమే రెండు తెలుగు రాష్ట్రాలలో బిజెపి నేతలు ఆశగా ఎదురు చూస్తుంటారు. కానీ ఏపిలో మిత్రపక్షంగా ఉన్న టిడిపి నేతలు, మంత్రులు వారి ముఖ్యమంత్రి చంద్రబాబు అందరూ కూడా మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని చాలా ఘాటుగా విమర్శిస్తుంటారు..చేసిన మేలు గురించి చెప్పుకొనే ప్రయత్నం చేయకపోగా ఏమీ చేయలేదని, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బు ప్రహరీ గోడలు కట్టడానికి కూడా సరిపోవని ఎద్దేవా చేయడం అందరూ వినే ఉంటారు. పైగా తమ వాదనలతో ఏపిలో బిజెపిని కోలుకొని విధంగా దెబ్బ తీస్తున్నారు కూడా. వారితో పోలిస్తే కెసిఆర్ తన ప్రసంగంతో మోడీని, కేంద్ర మంత్రులని ఎంతగా సంతోషపెట్టి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు.
ప్రధాన మంత్రి పర్యటనని ఏదో మొక్కుబడి పర్యటనగా భావించి సరిపెట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఆయన తెలంగాణ గడ్డపై అడుగు పెట్టడమే మహా ప్రసాదం అన్నట్లుగా కెసిఆర్ వ్యవహరించారు. చంద్రబాబు లాగా అనవసరమైన ఆర్భాటాలు ఏవీ చేయకపోయినా, పావుగంట ప్రసంగంతో అంతకి పదింతలు మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోగలిగారు. ఏదో రొటీన్ ఊక దంపుడు ఉపన్యాసం చేయకుండా, మనసులకి హత్తుకుపోయేలా, అతిధుల మనసులు కరిగిపోయేలా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇప్పటికిప్పుడు దాని ఫలితాలు కనబడకపోవచ్చు కానీ దానికి ఎప్పటికీ ‘గుడ్ రిటర్న్స్’ వస్తుండొచ్చు. కెసిఆర్ వేసిన పాచిక అప్పుడు పూర్తిగా పారినట్టు లెక్క.