ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిందని పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తొలిసారి రాష్ట్రానికి వచ్చి ఒక్క హామీ కూడా ఇవ్వలేదన్నా రు. తెలంగాణ ప్రజలను ఆదుకుంటారనుకుంటే, ఆవు కథ చెప్పి చేతులు దులుపుకున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ ఏమీ అడగలేదని, ప్రతిగా మోడీ కూడా స్పందించలేదని వీరిద్దరూ కలిసి ప్రజల ఆశలను వమ్ము చేశారన్నారు. మొత్తం ప్రచార ఆర్భాటమే తప్ప ఇతర ప్రయోజనాలేమీ లేవన్నారు.
ప్రధాని పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తొలిసారిగా ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తున్న తరుణంలో నిర్బంధకాండను కొనసాగించడం అర్ధరహితమన్నారు. తెలంగాణ లో కనీస హక్కులు కూడా లేకుండా, ఫ్యాక్షనిస్ట్ పాలన జరుగుతోందన్నారు. ప్రధానమంత్రి ఈ అణచివేతలపై కూడా దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.