తెలంగాణ కేసీఆర్ రాజకీయ నీతి మరోసారి కళ్లకు కట్టించింది మోదీ బహిరంగ సభ. ఆయన మాట్లాడే తీరులో ఎలా మారుతుందో అందరికి తెలిసిందే. కానీ ముందు నుండి కూడా మోదీతో, కేంద్రంతో కాస్త దూరంగా ఉంటున్న కేసీఆర్ ఒక్కసారిగా మోదీ గానం ఎత్తుకున్నారు. మొన్నటి దాకా కేంద్రం రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందించడం లేదని విమర్శించిన కేసీఆర్.. అదే నోటితో మోదీని నోరారా పొగిడారు.
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి నేతను చూడలేదంటూ మోడీని కేసీఆర్ పైకెత్తాశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా రెండేళ్ల పాలనలో అవినీతి వాసనే లేకుండా చేసిన ఘనత మీదేనంటూ మోడీని ఆకాశానికెత్తేశారు. కేంద్రం నుండి సహాయం లేదు బాబోయ్ అంటూ మోదీ సభకు ముందు పెదవి విరిచిన కేసీఆర్.. ఏకంగా కేంద్రం నుండి ఏఏ సహాయం అందిందో లిస్ట్ తో సహా వెల్లడించారు. మోదీని కేసీఆర్ పొగిడిన విధానం చూసిన బీజేపీ నాయకులు కూడా ఇంతలా తమ పార్టీ వాళ్లు కూడా పొగిడి ఉండరేమో అని అనుకున్నారట.
కేసీఆర్ స్ట్రాటజీ అలానే ఉంటుంది. ప్రధానిగా మోదీ మొదటిసారి తెలంగాణ పర్యటనకు వచ్చారు. అతిథి సత్కారాలతో సాదరంగా స్వాగతం పలికిన కేసీఆర్.. రాష్ట్రానికి అది కావాలి.. ఇది కావాలి అంటూ వేదిక మీద నుండి మాత్రం అడగలేదు. ఇక్కడే మోదీ కేసీఆర్ కు ఫ్లాట్ అయ్యాడని.. కేసీఆర్ మంచి మార్కులు కొట్టేసి.. కేంద్రం నుండి నిధులను రాబట్టుకోవడానికి లైన్ క్లీయర్ చేసుకున్నారని దిల్లీ పెద్దలు అనుకుంటున్నారట.