ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టార్ నయీం హతం

నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అనేక హత్యలు, భూదందా సెటిల్మెంటు కేసులలో నయీం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతనిపై సుమారు 100కి పైగా కేసులున్నాయి.

పోలీసుల నిఘా పెరగడంతో కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయి మళ్ళీ ఈ మధ్యనే బయటకి వచ్చి సెటిల్మెంటులు చేస్తున్నాడు. నయీం కోసం చాలా కాలంగా గాలిస్తున్న పోలీసులకి అతను మహబూబ్ నగర్ లో షాద్ నగర్ లో గల మిలీనియం టౌన్ షిప్పులో ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో నల్గొండ గ్రేహౌండ్ పోలీసులు అతనిని ఇంటి చుట్టుముట్టారు. తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తున్న సమయంలో పోలీసులు నయీం ని, అతని అనుచరుడిని కాల్చి చంపారు. కారు డ్రైవర్ మాత్రం తప్పించుకొని పారిపోయాడు. నయీం ఇంటిలో నుంచి ఒక ఏకె-47, నాలుగు తుపాకీలు పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

భువనగిరికి చెందిన నయీం 1989లో నక్సల్ లో చేరాడు. ఆ తరువాత అతనే అనేక మంది నక్సలైట్లని హత్యలు చేశాడు. వారిలో మావోయిస్ట్ నేత సాంభశివుడు, మావో కార్యకర్త బెల్లీ తదితరులు, అతని చేతిలో చంపబడ్డారు. ఐపిఎస్ అధికారి కె.ఎస్.వ్యాస్, పాటల్ల గోవర్ధన్ రెడ్డి, రాములు, పౌరహక్కుల సంఘం నాయకుడు పురుషోత్తం తదితరుల హత్య కేసులలో నయీం ప్రధాన నిందితుడు.  పాముని ఆడించేవాడు పాము కాటుతో చస్తాడన్నట్లుగా, నేర ప్రపంచంలో తుపాకులతో ఆడుకొన్న నయీం చివరికి ఆ తుపాకీ గుండుతోనే హతం అయ్యాడు.