తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా ఆదివారం రాష్ట్రంలో అడుగుపెట్టారు. గజ్వేల్ సభలో హైలైట్స్:
1. మిషన్ భగీరథ ప్రారంభోత్సవం చేసిన తరువాత రామగుండంలో 1,600 మెగావాట్ల ధర్మల్ విద్యుత్ కేంద్రం, వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, రామగుండంలో ఎరువుల కర్మాగారం, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైనుకు శిలాఫలకాలని మోడీ ఆవిష్కరించారు. ఆ కార్యక్రమం అంతా మూడు నిమిషాలలోనే ముగిసిపోయింది. వాటినే శంఖుస్థాపన కార్యక్రమాలుగా తెలంగాణ ప్రభుత్వం పేర్కొనడం విశేషం. ప్రధాని సమయం కేటాయించకపోవడం వల్లనే ఆ విధంగా చేయవలసి వచ్చింది.
2. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఏమాత్రం తడబడకుండా చాలా చక్కగా హిందీలో ప్రసంగించారు. ప్రసంగం ముగించిన తరువాత తాను మోడీకి హిందీలో చెప్పిన విషయాలని మళ్ళీ ప్రజలకి అర్ధం కావడం కోసం క్లుప్తంగా తెలుగులో చెప్పారు.
3. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ, చాలా సహాయం చేస్తున్నందుకు కెసిఆర్ పదేపదే కృతజ్ఞతలు చెప్పుకొన్నారు. ప్రధాని రెండేళ్ళ పాలనలో ఎక్కడా అవినీతి లేకుండా సాగిందని, కేంద్ర ఆదాయంలో రాష్ట్రాలకి 32 నుంచి 42 శాతం పెంచడం వంటి గొప్ప నిర్ణయాలు తీసుకొన్నందుకు మోడీకి కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకొన్నారు.
4. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి చురకలు వేస్తున్నట్లుగా, “ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా నాకు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమి కోరాలో ఎంత కోరాలో తెలుసు. కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి కూడా నాకు తెలుసు. కనుక నేనేమీ మిమ్మల్ని లక్ష కోట్లు..50వేల కోట్లో ఇమ్మని అడగను,” అని అన్నారు.
5. తెలంగాణలో ఒక సాగునీటి ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించవలసిందిగా కెసిఆర్ కోరారు. అలాగే రాష్ట్రంలో ఎయిమ్స్ మరియు ఉన్నత విద్యాసంస్థలని ఏర్పాటు చేయాలని కోరారు.
6. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతోనే తెలంగాణ శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని, కనుక రాష్ట్రానికి ప్రధాని ప్రేమ, అభిమానం, ఆశీర్వాదం కావాలని కోరారు.
7. మోడీ యధాప్రకారం సోదర సోదరీమణుల్లారా..అంటూ తెలుగులో రెండు ముక్కలు మాట్లాడి ఆ తరువాత తనదైన శైలిలో ప్రజలని ఆకట్టుకొనేలాగా హిందీలో ప్రసంగించారు.
8. కెసిఆర్ దీక్షాదక్షతలని చాలా మెచ్చుకొన్నారు. “తెలంగాణ కేవలం రెండేళ్ళ వయసున్న చిన్న రాష్ట్రం. కానీ పట్టుదల బలమైన సంకల్పం ఉంటే అద్భుతమైన ప్రగతి సాధించవచ్చని కెసిఆర్ నిరూపించారు. అందుకు ఆయనని మనసారా అభినందిస్తున్నాని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఎటువంటి అద్భుతాలు చేయవచ్చో తెలంగాణని చూస్తే అర్ధం అవుతుందని అన్నారు. రాష్ట్రానికి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
9. మోడీ మధ్యలో గోవుల సంరక్షణ, వాటిని వ్యవసాయంతో అనుసంధానం చేయడం వలన కలిగే లాభాల గురించి చెప్పి గోవులపై కూడా కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయంటూ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి చురకలు వేశారు.
10. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఘర్షణపూరితంగానే ఉండేవని కానీ తాము అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు చాలా మెరుగుపడ్డాయని మోడీ చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే శరవేగంగా దేశాభివృద్ధి జరుగుతుందని ఆయన అభిప్రాయం పడ్డారు.