ముఖ్యమంత్రి కెసిఆర్ వాక్చాతుర్యం గురించి అందరికీ తెలిసిందే. ఆయనొక్కరికే కాదు..ఆయన కుమారుడు కెటిఆర్, కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావులు కూడా ఆయనకి ఏమాత్రం తీసిపోరు. వారు నలుగురు ఏ అంశంపైనైనా ఎంత క్లిష్ట సమస్యపైనైనా ఏమాత్రం తడుముకోకుండా అనర్గళంగా మాట్లాడి ప్రజలని మెప్పించగలరు. తమ ప్రభుత్వం వలన ఏదైనా ఒక పొరపాటు జరిగితే, దానిని చాలా చక్కగా కవర్ చేసుకోవడమే కాకుండా, తమని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకి ధీటుగా జవాబులు చెప్పగల సమర్ధులు. నిజం చెప్పాలంటే తెలంగాణ ప్రతిపక్ష నేతలలో ఎవరూ కూడా వారి వాగ్ధాటికి సరితూగలేరు. వారితో సమానంగా మాట్లాడగలిగినా, వారిలా ప్రజలని ఆకట్టుకొనే విధంగా మాట్లాడలేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దానినే నిజామాబాద్ ఎంపి కవిత మరొకమారు నిరూపించి చూపారు.
ఎంసెట్ వ్యవహరంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్ని విమర్శలు ఎదుర్కొంటోందో..ఎంత అప్రదిష్ట మూటగట్టుకొందో అందరూ చూస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెరాస మంత్రుల రాజీనామాలకి డిమాండ్ చేస్తోంది. కానీ ఈ ఎంసెట్ కుంభకోణం వ్యవహారాన్నే కవిత మరో కోణంలో చాలా గొప్పగా ప్రెజెంట్ చేయడమే కాకుండా, అదేదో ఘనకార్యం అన్నట్లుగా చెప్పడం చూస్తే శభాష్ కవితమ్మ శబాష్..అని మెచ్చుకోకుండా ఉండలేము.
ఇంతకీ ఆమె ఏమన్నారంటే, “దేశంలో చాలా రాష్ట్రాలలో ఎంసెట్ పరీక్షలు లీక్ అవుతున్నాయి. అదొక పెద్ద మాఫియాగా తయారైంది. కానీ తెలంగాణ ప్రభుత్వమే దోషులని కనిపెట్టగలిగింది. ఆ మాఫియాకి మా ప్రభుత్వం కళ్ళెం వేసింది. విద్యార్ధులు నష్టపోకుండా చర్యలు తీసుకోగలుగుతున్నాము. తద్వారా విద్యార్ధులకి న్యాయం జరుగుతుంది,” అని చెప్పారు. ఎవరైనా కాదని వాదించగలరా?
ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి కూడా ఆమె మాటలు చెప్పుకోక తప్పదు. కానీ అంతకంటే ముందు ఓసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి రావాలి. ఒకప్పుడు ఏపి సిఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కి పదేపదే ఒక మాట చెప్పేవారు. “ప్రభుత్వాలుగా సహకరించుకొందాము..పార్టీలుగా ఎవరి పని వారు చేసుకుపోదాము,” అని! అప్పుడు అయన మాటలు విని టిఆర్ఎస్ నేతలు అందరూ పక్కున నవ్వారు. కానీ కెసిఆర్ మాత్రం గురువుగారి సూచనలో మంచి పాయింటే ఉందని గ్రహింఛి దానిని చక్కగా ఆచరించి చూపారు.
ఓటుకి నోటు కేసులో చంద్రబాబుని జైలుకి పంపించేయడానికి స్కెచ్ వేసినా మళ్ళీ ఆయన పిలిస్తే కాదనకుండా అమరావతి శంఖుస్థాపనకి వెళ్లి వచ్చారు. ఆ తరువాత టెలిఫోన్ ట్యాపింగ్ కబుర్ల గురించి పట్టించుకోకుండా చంద్రబాబుని ఆయుత చండీ యాగానికి పిలిచి మర్యాదలు చేసి పంపారు. అంతేకాదు..బాలకృష్ణ అడిగితే కాదనకుండా చిన్న చిన్న పనులు చేసిపెడుతుంటారు కూడా. అదే చేత్తో తెలంగాణలో తెదేపాని కూడా ఖాళీ చేసిపడేస్తే, చంద్రబాబు నోరు విప్పి ఇదేమిటని అడగలేకపోయారు! ఎందుకంటే అయన చెప్పిన సిద్దాంతాన్నే కెసిఆర్ ఫాలో అయ్యారు కనుక. అదే ఫార్ములాని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అప్ప్లై చేస్తున్నామని కవితమ్మ చెప్పడం వింటే, రాష్ట్రంలో బిజెపికి కూడా మూడిందా? దానికీ కెసిఆర్ స్కెచ్ సిద్ధం చేస్తున్నారా? అని అనుమానం కలుగుతోంది.
అవసరమైనప్పుడు మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ, హైకోర్టు విభజన వంటి విషయాలలో పోరాడుతున్నామని కవిత చెప్పారు. రాష్ట్ర బిజెపి నేతలు విమర్శలు చేస్తున్నప్పటికీ టిఆర్ఎస్ పెద్దగా పట్టించుకోదు. కానీ టిడిపిని వాష్ చేసి బిజెపిని స్పేర్ చేస్తుందా? అంటే కాదనే అనుకోవచ్చు. దానికి ఇంకా టైం ఉంది కనుక స్పేర్ చేస్తోందనుకోవాలేమో? ఒకప్పుడు మోడీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా చేరుదామని కవితమ్మ చాలా ఉత్సాహ పడ్డారు. కానీ ఆ తరువాత లెక్కలు కట్టుకొన్నాక దాని వలన లాభం కంటే నష్టమే ఎక్కువని అనుకొన్నట్లున్నారు..అందుకే అమిత్ షా స్వయంగా కేంద్రమంత్రి పదవి ఆఫర్ చేసినా మాకు అక్కరలేదు పొమ్మన్నారు కెసిఆర్. కానీ కేంద్రంతో కూడా చంద్రబాబు చెప్పిన ఫార్ములానే అమలు చేస్తున్నామని కవితమ్మ చెపుతున్నారు కనుక ఆప్షన్ ఓపెన్ గానే ఉంచుకొన్నారనుకోవాలి. ప్రస్తుతానికి మాత్రం చేరడం లేదని కన్ఫర్మ్ చేసేశారు కవితమ్మ.