తెలంగాణ సర్కార్ కు ముందు నుండి మల్లన్నసాగర్ ప్రాజెక్టు అన్ని రకాలుగా అడ్డంకులు తెచ్చిపెట్టింది. తాజాగా హైకోర్టు తీర్పు మరోసారి మల్లన్నసాగర్ ను అడ్డుకునేలా ఉంది. టి సర్కార్ తీసుకువచ్చిన జీవో 123, 124ను హైకోర్టు కొట్టేస్తూ తీర్పును వెల్లడించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై సీరియస్ గానే కష్టపడుతున్నారు. జీవో123లో కొన్ని మార్పులు చెయ్యాలనే అలాగే తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని కూడా అనుకుంటున్నారని సమాచారం. కాగా దీనిపై కేసీఆర్ ప్రయత్నాల సంగతి పక్కన బెడితే హోమంత్రి నాయిని నర్సింహా రెడ్డి మాట తూలారు.
''జీవో 123పై ఎవడో పిచ్చోడు కోర్టులో కేసేసిండు.. ఒక జడ్జి.. ఆ జీవోను రద్దు చేసిండు.. దానిపై ప్రభుత్వం అప్పీలుకు పోతుంది. నేడు సంబరాలు చేసుకుంటున్న వారు.. రేపు ఎక్కడ పోతరో'' అంటూ.. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను వేగంగా పూర్తి చెయ్యాలని తీసుకువచ్చిన జీవో123పై హైకోర్టు తీర్పుపై, కోర్టుకు అప్పీలుకు వెళ్లిన రైతులపై నాయిని తన అక్కసును వెళ్లగక్కారు. పనిలో పనిగా ప్రతిపక్షాలపై కూడా తన మాటల తూటాలు పేల్చారు. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా టి సర్కార్ అప్పిల్కు వెళుతుందని, తమకే అనుకూలంగా తీర్పు వస్తుందని అన్నారు. ప్రతిపక్షాల దురాగతాలు దుర్మార్గంగా ఉన్నాయంటూ ధ్వజమెత్తారు.