
తెలంగాణ టిడిపి నేతలు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నేతృత్వంలో నిన్న గవర్నర్ నరసింహాన్ని కలిసి తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. భూసేకరణ చట్టం-2013 ప్రకారమే మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేయవలసిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు గవర్నర్ కి విజ్ఞప్తి చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “తెరాస ప్రభుత్వానికి ఇప్పటివరకు హైకోర్టు 16 సార్లు మొట్టికాయలు వేసింది. అయినా వారికి సిగ్గు రాలేదు. సిగ్గు పడటం లేదు కూడా. అందుకే మళ్ళీ హైకోర్టు బెంచికి అప్పీలు చేసుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని ప్రాజెక్టులకీ భూసేకరణ చట్టం-2013 ప్రకారమే రైతుల నుంచి భూమిని సేకరించాలని మేము మొదటి నుంచి చెపుతూనే ఉన్నాము కానీ తెలంగాణ ప్రభుత్వం మా సూచనలని పట్టించుకోకుండా ముందుకు వెళ్లి భంగపడింది,” అని ఎల్.రమణ అన్నారు.
తెలంగాణలో అన్ని ప్రాజెక్టులకి భూసేకరణ చట్టం-2013 ప్రకారమే రైతుల నుంచి భూమిని సేకరించాలని టిడిపి నేతలు కోరుతున్నప్పుడు, ఏపిలో అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో భూసేకరణ చేసిందా? చేస్తోందా? అంటే లేదని అందరికీ తెలుసు. రాజధాని ప్రాంతంలో ఆరేడు గ్రామాల రైతులు ప్రభుత్వానికి తమ భూములు ఇవ్వడానికి నిరాకరించడంతో భూసేకరణ చట్టం-2013 వారిపై ప్రయోగించి వారి భూములు స్వాధీనం చేసుకోవడానికి రైతులకి నోటీసులు ఇచ్చింది. అక్కడ తప్ప రాష్ట్రంలో మరెక్కడా ఆ చట్టం ప్రకారం భూసేకరణ చేయలేదు.
అమరావతి నిర్మాణం కోసం ఏపి ప్రభుత్వం 33,000 ఎకరాలని రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో సేకరించింది. ఇంకా మచిలీపట్నం రేవు, గన్నవరం, భోగాపురం విమానాశ్రయాలు, పారిశ్రామికవాడల ఏర్పాటు కోసం వేలాది ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ పద్ధతిలోనే సేకరించబోతోంది. అక్కడ కాంగ్రెస్, వైసిపి, వామపక్షాలు, చివరికి పవన్ కళ్యాణ్ కూడా భూసేకరణని తీవ్రంగా వ్యతిరేకించినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మాత్రం జంకకుండా నయాన్నో భయాన్నో రైతులని ఒప్పించి భూసేకరణ చేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కోసం కొంచెం భూమిని తీసుకొంటే ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయి. భూసేకరణ చట్టం-2013 ప్రకారమే అంతా జరగాలని కోరుతూ గవర్నర్ ని కలిసిన తెలంగాణ టిడిపి నేతలు మరి ఏపిలో ల్యాండ్ పూలింగ్ విధానంలో జరుగుతున్న ఈ భారీ భూసేకరణని ఎందుకు వ్యతిరేకించడం లేదు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలు దానిని గట్టిగా సమర్ధించుకొంటున్నప్పుడు, ఇక్కడ తెలంగాణలో తెదేపా నేతలు భూసేకరణ చట్టం-2013 ప్రకారమే జరగాలని ఎందుకు పట్టుబడుతున్నారు? ఇది ద్వంద వైఖరి కాదా? వారే చెప్పాలి.