
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్ళు గడిచిపోయినా ఇంతవరకు ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా రాష్ట్రంలో అడుగుపెట్టలేదని టిఆర్ఎస్ నేతలు చాలా సార్లు బాధ పడ్డారు. బహుశః ప్రజలు కూడా అదే విధంగా భావించి ఉండవచ్చు. చివరికి ముఖ్యమంత్రి కెసిఆరే ఆయనకి డేట్ ఫిక్స్ చేసి తెలంగాణ రప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పధకాన్ని ప్రారంభోత్సవం చేసేందుకు ఆగస్ట్ 7న గజ్వేల్ కి వస్తున్నారు మోడి . ఆయన మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి వస్తున్నందున చాలా కానుకలు తీసుకురాబోతున్నారని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డా.లక్ష్మణ్ ప్రకటించారు. వాటిలో హైకోర్టు విభజన గురించి నిర్దిష్టమైన ప్రకటన కూడా ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక ఆయన రాక కోసం అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రధాని మోడీని తెలంగాణకి రావద్దంటూ నిన్న ఒక బహిరంగ లేఖ వ్రాయడం విశేషం. నాడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హాయంలో అబ్దుల్ కలాం ఆజాద్ పేరిట రూ.3300 కోట్లతో పూర్తి చేసిన పధకానికే టిఆర్ఎస్ ప్రభుత్వం పేరు మార్చి మిషన్ భగీరధ పేరుపెట్టి తనదిగా చెప్పుకొంటోందని, కనుక దాని ప్రారంభోత్సవానికి రావొద్దని లేఖలో కోరారు. తమ ప్రభుత్వం 2008లోనే ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలు తీసుకువస్తే, వాటిని తామే తీసుకువచ్చినట్లు గ్రేటర్ ఎన్నికలలో మంత్రి కెటిఆర్ అబద్దపు ప్రచారం చేసుకొన్నారన్నారు. విభజన చట్టంలో తెలంగాణకి హామీలను అమలు చేయాలని, అలాగే కాజీపేటలో రైల్వే కోచ్, సెయిల్ ఉక్కు కర్మాగారం, హార్టీ కల్చర్, ట్రైబల్ యూనివర్సిటీల కోసం నిధులు కేటాయిస్తూ నిర్దిష్టమైన ప్రకటన చేయాలని లేఖలో కోరారు.
రాష్ట్రంలో జరిగే ఒక శుభకార్యానికి ప్రధాని మోడీ మొట్టమొదటిసారిగా వస్తుంటే, రావొద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ వ్రాయడాన్ని మంత్రి హరీష్ రావు తప్పు పట్టారు. ఒక గౌరవనీయమైన అతిధి రాష్ట్రానికి వస్తుంటే రావద్దని రాయడం కాంగ్రెస్ పార్టీకే చెల్లునని హరీష్ రావు విమర్శించారు. ఈ విధంగా వ్యవహరించడం వల్లనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని అయినా దాని తీరు మారలేదని విమర్శించారు. ఇదే విధంగా వ్యవహరిస్తే మున్ముందు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుందని హెచ్చరించారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా చురుకుగా వ్యవహరించి ప్రజలని ఆకట్టుకొంది. టిఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ.:123ని హైకోర్టు కొట్టి వేయడంతో కాంగ్రెస్ పార్టీ పోరాటం ఫలించినట్లయింది. కనుక ప్రజలలో దానికి ఎంతో కొంత ఆదరణ పెరిగి ఉండవచ్చు. కానీ ప్రధాని మోడీ మొదటిసారిగా తెలంగాణకి వస్తుంటే, రావద్దని లేఖ రాసి పొరపాటు చేసి ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల దురాభిప్రాయం ఏర్పడేలా చేసుకొంది. అంతేకాదు..టిఆర్ఎస్ తనని విమర్శించే అవకాశం కూడా కల్పించినట్లయింది.