
తెలంగాణ ప్రభుత్వానికి గత నెలరోజులుగా గ్రహాలు అనుకూలిస్తున్నట్లు లేదు. అందుకే ఒకేసారి చాలా కష్టాలు చుట్టుముట్టాయి. వాటిలో తెలంగాణ యూనివర్సిటీలకి వైస్-ఛాన్సిలర్ల నియామకం కోసం ఇచ్చిన జీ.ఓ., మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ కోసం ఇచ్చిన జీ.ఓ.ని ఇంచుమించు ఒకేసారి హైకోర్టు రద్దు చేయడంతో, ప్రభుత్వానికి చాలా అప్రదిష్ట కలిగింది. వాటిలో వైస్-ఛాన్సిలర్ల కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకి, మల్లన్నసాగర్ భూసేకరణ కేసులో సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ధర్మాసనంలో సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.
మొదటి కేసులో ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ. యూజిసి నిబంధనలకి వ్యతిరేకంగా ఉన్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. రెండవ కేసులో భూసేకరణ చట్టం-2013కి లోబడి మాత్రమే భూసేకరణ చేయవలసి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వేరేగా దానికోసం జీ.ఓ. జారీ చేయడం తప్పని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అంటే రెండు కేసులలో కూడా నిబంధనలకి విరుద్ధంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. కనుక తెలంగాణ ప్రభుత్వం వాటిపై అప్పీలుకి వెళితే, అక్కడా అదే రకమైన తీర్పు రావచ్చు లేదా అదృష్టం బాగుంటే అనుకూలంగా తీర్పు రావచ్చు. కానీ ఒకవేళ అక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలితే, అప్పుడు ప్రతిపక్షాల ముందు ఇంకా చులకన అవుతుంది.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న కారణంగానే ప్రతిపక్షాలు దానిని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ముందుకు వెళ్ళింది. కనుక ఇప్పుడు దానిపై వెనక్కి తగ్గితే తప్పు చేసినట్లు అంగీకరించినట్లు అవుతుంది. అందుకే దానిపై అప్పీలుకి వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందేమో? కానీ ఈ రెండు కేసులలో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళడమే చాలా మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.