
భూసేకరణపై జారీ చేసిన జిఒ 123, 124లను హైకోర్టు కొట్టివేయడంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. తెలంగాణ సర్కార్ ప్రాజెక్టులను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు సర్కార్ కు షాకిచ్చింది. రైతుల నుండి సేకరించే భూమిని జివో నెంబర్ 123 ప్రకారం కాకుండా భారత ప్రభుత్వ భూసేకరణ చట్టం 2013 ప్రకారం సేకరించాలని హైకోర్టు అక్షింతలు వేసింది. హైకోర్టు తీర్పుతో జీవో123, 124లపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండేళ్లు గడిచాయి. ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులన్నీ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. జిఒ-123 కింద వేలాది ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించారు. ఇంకా సేకరించాల్సిన భూమి లక్షల ఎకరాల్లో ఉంది. కోర్టు తీర్పుపై డివిజనల్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లినా, అంతకన్నా ముందు దీనిపై ఏదో ఒక పరిష్కారానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది. భూసేకరణ చట్టం-2013 ప్రకారమే భూసేకరణ చేయాలని హై కోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ చట్టంతో భూసేకరణ చేయాలంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎస్‌సి, ఎస్‌టిల నిర్వాసితులకు అదనపు పరిహారం, అర్హులకు ఉద్యోగాలు, కొంత మందికి భూమికి భూమి వంటి నిబంధనలు ఈ చట్టంలో ఉన్నా యి.
కానీ టీసర్కార్ మాత్రం వీటి మీద దృఫ్టి సారించకుండా కేవలం భూసేకరణ మీద మాత్రమే దృఫ్టి సారించడం జరిగింది. దాంతో కొంత మంది రైతులు ఇవే అంశాలను ప్రస్తావిస్తూ కోర్టు మెట్లు ఎక్కారు. భూసేకరణ చట్టంలోని నిబంధనలను పాటిస్తూ భూసేకరణ చెయ్యాలంటే చాలా టైం తీసుకుంటుంది అనేది తెలంగాణ సర్కార్ ఆలోచన. దాంతో జిఓ 123పై వచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లడానికి తోడు జిఒలో మార్పులు, పరిహారం పెంపు, ఇతర ప్రత్యామ్నాయాలన్నింటినీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.