టిటిడిపిలోకి విజయశాంతి..?!

ఒకప్పటి నటి, పొలిటికల్ లీడర్ విజయశాంతి టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ నేత రేవంత్ తో మంతనాలు జరిపినట్టు సమాచారం. తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలంటే .. టీడీపీ ఒక్కటే మార్గమని భావిస్తున్నట్టు సమాచారం . అయితే టీడీపీలో చేరే ముందు… విజయశాంతి .. చంద్రబాబుకు కొన్ని షరతులు కూడా పెట్టినట్టు సమాచారం. దానికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ఇక విజయశాంతి కి టీడీపీలో కొన్ని కీలక బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

టిఆర్ఎస్ తరపున మెదక్ నుంచి పోటీ చేసి గెలిచిన విజయశాంతి, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కేసీఆర్ కు చెల్లినంటూ ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత పార్టీలో ఈమెకు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. దీంతో ఆమె కూడా టీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ వచ్చారు. చివరికి కేసీఆరే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన విజయ శాంతి మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు కూడా దూరంగానే ఉంటూ వచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల పనితీరుపై అసంతృప్తిగా ఉన్న ఈమె, కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి .. సైకిలెక్కడానికి రెడీ  అవుతున్నట్టు సమాచారం .

తెలంగాణలో టీడీపీ కి క్యాడర్ ఉన్న నేతలను లేని పరిస్థితి. ముఖ్యమైన నేతలందరూ.. టీఆర్ఎస్ కు క్యూ కట్టేశారు  అందరూ అధికార పార్టీలోకి చేరిపోవడంతో ప్రతిపక్ష పార్టీల్లో సమస్యలపై గట్టి గళాన్ని వినిపించే వాళ్లు కరువయ్యారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రేవంత్, మోత్కుపల్లి మినహా పెద్దగా మాట్లాడే వారు లేరు. దీంతో విజయశాంతి పార్టీలోకి వస్తే .. పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అయితే దీనిపై పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాలగా చర్చించుకుంటున్నారు. ముందు సొంతంగా పార్టీ.. ఆ తర్వాత పార్టీని టిఆర్ఎస్ లో విలీనం.. తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు టిడిపి.. ఇలా దాదాపుగా అన్ని పార్టీలను చూడబోతోంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

విజయశాంతి లాంటి ఒకనాటి స్టార్లకు ఎంతో కొంత చరిష్మా ఉండే మాట వాస్తవమే కానీ ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో అది ఎంత వరకు పనికొస్తుంది అనేది ప్రశ్న. తెలుగుదేశం పార్టీలోకి విజయశాంతి చేరితే ఆమె కీలకంగా మారడం ఖాయంగానే కనిపిస్తోంది. ఎందుకంటే టిటిడిపిలో రేవంత్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో మాట్లాడే వాళ్లు కరువయ్యారు. మోత్కుపల్లి, రమణ ఉన్నా గానీ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. ఈ టైంలో తెలుగుదేశం పార్టీలో చేరడం విజయశాంతికి కలిసి వచ్చే అవకాశమే. మరో రకంగా చూస్తే తెలంగాణలో అధికార పక్షం టిఆర్ఎస్ కు విజయశాంతి ఎప్పుడో దూరమైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుండే ఇప్పుడు బయటకు రావాలని కోరుకుంటున్నారు. మరి మిగిలింది ఒక్క తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాత్రమే. చూడాలి విజయశాంతి వల్ల టిటిడిపికి, టిటిడిపి వల్ల విజయశాంతికి ఎంత వరకు లాభం చేకూరుతుందో.