
నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడే హైదరాబాద్ వాసులకు కాస్త రిలీఫ్ కలిగించేందుకు తెలంగాణ సర్కార్ చర్యలకు దిగుతోంది. ఇప్పటికే ట్రాపిక్ ను నియంత్రించేందుకు చర్యలకు పూనుకున్న సర్కార్ మరోసారి దీనిపై కేసీఆర్ అధ్యక్షతన సమావేశంలో చర్చించారు. మరో వందేళ్ల పాటు ప్రజలకు ఉపయోగపడేలా రోడ్లను ఆధునీకరించి, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
నాలుగైదేళ్లలో దశల వారీగా రహదారుల పునర్నిర్మాణం పనులు చేయాలని కేసీఆర్ చెప్పారు. ఫస్ట్ ఫేజ్ లో పైలట్ ప్రాజెక్టుగా వంద కిలోమీటర్ల మేర రహదారులను మెరుగు పరచాలని ఆదేశించారు. నగర రహదారుల అభివృద్ధిలో తాము కూడా పాలుపంచుకుంటామని సిమెంట్ మాన్యుఫాక్చరింగ్ అసోసియేషన్ ముందుకొచ్చింది.రహదారులను బాగా వెడల్పు చేయాలని, నాలుగు లైన్లు, ఆరు లైన్ల రోడ్లు నిర్మించాలని, పాదచారుల కోసం ప్రత్యేకంగా ఫుట్ పాత్ లు నిర్మించాలని, రహదారుల వెంటనే డక్ట్స్ తీయాలని చెప్పారు. ఆ డక్ట్స్ లోనే అన్ని రకాల కేబుళ్లు రావాలన్నారు. భవిష్యత్తులో వేసే కేబుళ్లు కూడా డక్ట్స్ లోనే వేసే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.