ఆ ఫోటో హైదరాబాద్ మెట్రోది కాదు

మెట్రో రైలు ప్రాజెక్టు పిల్లర్ విరిగిపోయి ప్రమాదకర స్థితిలో ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. దీన్ని కేటీఆర్ ఖండించారు. పిల్లర్ ప్రమాదకరంగా మారిందని.. హైదరాబాద్ మెట్రో పరిస్థితి ఇది అంటూ వచ్చిన వార్తలపై ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు. ఆ ఫోటో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు లేదా పివి ఎక్స్ ప్రెస్ హైవేది కాదు అని ఆయన స్పష్టం చేశారు. అసలు అది మన దేశానికి చెందిన ఫోటో కాదు అని ఆయన వెల్లడించారు. 

పాకిస్థాన్ లోని రావల్పిండికి చెందిన మెట్రో రైల్ కు సంబంధించిన ఫోటోను హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ఫోటోగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. ఇలాంటి పుకార్లను ప్రజలు నమ్మవద్దని మంత్రి కోరారు. గచ్చిబౌలి సమీపంలోని మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటో అని జరుగుతున్న ప్రచారంపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తానికి సోషల్ మీడియాలో నిన్నటి దాకా హైదరాబాద్ మెట్రో రైల్ అంటూ హల్ చల్ చేసిన ఫోటో ఫేక్ అని కేటీఆర్ స్పష్టతనివ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.