
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మళ్ళీ ఎదురుదెబ్బ తగిలింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ కోసం జారీ చేసిన జి.ఓ. నెంబర్: 123 ని హై కోర్ట్ రద్దు చేసింది. భూసేకరణ చట్టం-2013 ప్రకారమే మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేపట్టాలని స్పష్టం చేసింది.
దీనితో తెరాస ప్రభుత్వం ఆ ప్రాజెక్టు క్రింద ముంపుకి గురయ్యే 7 గ్రామాలలో జి.ఓ. నెంబర్: 123 ప్రకారం చేసిన భూసేకరణ, రిజిస్ట్రేషన్లు కూడా రద్దైనట్లేనని భావించవచ్చు. అంతే కాదు దాని కోసం మంత్రి హరీష్ రావు శ్రమ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరైపోయినట్లే! హైకోర్టు తాజా తీర్పు వలన ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి అవరోధం ఏర్పడటమే కాక ప్రతిపక్ష పార్టీల ముందు తెలంగాణ ప్రభుత్వం తలదించుకోవలసి రావడం ఇంకా ఇబ్బందికరమే. ప్రతిపక్షాలు ముందు నుండి జి.ఓ.నెంబర్:123ని వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. భూసేకరణ చట్టం-2013 ప్రకారమే భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. హైకోర్టు తీర్పుతో చివరికి వారి మాటే నెగ్గింది.
హైకోర్టు తీర్పుని ప్రతిపక్ష పార్టీలు స్వాగతిస్తూ అప్పుడే తెరాస ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కెసిఆర్ పై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టాయి. హైకోర్టు తీర్పు ముఖ్యమంత్రికి, తెరాస ప్రభుత్వానికి చెంపదెబ్బ వంటిదని వర్ణించారు. హైకోర్టులో ఎన్నిసార్లు ఎదురుదెబ్బలు తింటున్నా, మొట్టికాయలు వేయించుకొంటున్నా తెలంగాణ ప్రభుత్వం తీరు మారడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతృత్వ పోకడలు చెల్లవని హైకోర్టు తీర్పు స్పష్టం చేసిందన్నారు. కనీసం ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.