హైకోర్టు విభజన, న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపు సమస్యలపై న్యాయవాదులు పోరాడినప్పుడు, ఆ సందర్భంగా 11మంది న్యాయమూర్తులు, కోర్టు ఉద్యోగులని మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్.పి.భోస్లే సస్పెండ్ చేశారు. అందుకు ఆగ్రహించిన న్యాయవాదులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ కి ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులకే జస్టిస్ దిలీప్.పి.భోస్లే అలహాబాద్ హైకోర్టుకి బదిలీ అయ్యి వెళ్లిపోయారు. న్యాయమూర్తులపై సస్పెన్షన్లు కూడా ఎత్తివేయబడ్డాయి. హైకోర్టు విభజనపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని పునః సమీక్షించేందుకు వీలుగా ఆ కేసుని హైకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయబడింది.
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమేష్ రంగనాథ్ బాధ్యతలు చేపట్టారు. కనుక సమస్యలన్నీ పరిష్కారం అయినట్లే.. పరిస్థితులు చక్కబడినట్లేనని అందరూ భావిస్తున్న సమయంలో, న్యాయవాదులు సమ్మె చేస్తున్న రోజుల్లో రాష్ట్రంలో వివిధ న్యాయస్థానాలపై జరిగిన దాడులు వగైరాలని సుమోటుగా స్వీకరించి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సూచనల మేరకు జస్టిస్ రమేష్ రంగనాథ్, జస్టిస్ యు.దుర్గా ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం రంగారెడ్డి, వరంగల్ జిల్లా కోర్టుల న్యాయవాదులతో పాటు మరికొందరికి నిన్న నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కారం నేరం క్రింద వారిపై చట్ట ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలుపమని ఆ నోటీసులలో పేర్కొంది. ఆగస్ట్ 23వ తేదీకి ఈ కేసుల విచారణని వాయిదా వేసింది.
హైకోర్టు చర్యతో న్యాయవాద సంఘాలలో మళ్ళీ ఉద్రిక్తత ఏర్పడింది. త్వరలో తెలంగాణ న్యాయవాదుల జేఏసి సమావేశమయ్యి హైకోర్టు నోటీసులపై చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు ఆదేశాలకి మళ్ళీ నిరసనలు తెలపాలని వారు నిర్ణయించుకొంటే పరిస్థితులు మళ్ళీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది. న్యాయవ్యవస్థలో తరచూ ఇటువంటి పరిణామాలు జరుగుతుండటం ఎవరికీ మంచిది కాదు.