విభజన వలన తెలంగాణ కూడా నష్టపోయింది: కెకె

తెరాస ఎంపి కె. కేశవ్ రావు రాజ్యసభలో మాట్లాడుతూ, “రాష్ట్ర విభజన వలన తెలంగాణ రాష్ట్రం కూడా చాలా నష్టపోయింది. రాష్ట్ర విభజన వలన సమస్యలు పరిష్కారం అవుతాయనుకొంటే నేటికీ అనేక సమస్యలు యధాతధంగా ఉన్నాయి. రెండేళ్ళయినా హైకోర్టు విభజన జరగలేదు. నీటి పంపకాలపై నిత్యం రెండు రాష్ట్రాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగులు, ఆస్తుల పంపకాలు ఇంతవరకు పూర్తవలేదు. దీని వలన రైతులు, ఉద్యోగులు, విద్యార్ధులు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించాలి,” అని కోరారు.

ఆయన చెప్పిన సమస్యలన్నీ నేటికీ పరిష్కారం కాలేదని అందరికీ తెలుసు. కానీ వాటికి కేంద్రాన్ని నిందించే బదులు, ఏపి, తెలంగాణ ప్రభుత్వాలు తమని తామే నిందించుకోక తప్పదు. టిడిపి, టిఆర్ఎస్ పార్టీలు తమ మధ్య ఉన్న రాజకీయ విభేదాలని, పంతాలని, పట్టింపులని ప్రభుత్వాలకి పాకించడం వల్లే వాటి మధ్య సయోధ్య కుదరడం లేదనే సంగతి స్పష్టంగా కనబడుతూనే ఉంది.

అసలు రాష్ట్ర స్థాయిలో రెండు ప్రాంతాల నేతలు, మేధావులు కూర్చొని రాష్ట్ర విభజన ఏ విధంగా చేయాలని చర్చించుకొని విభజించుకొని ఉండి ఉంటే, నేడు ఇటువంటి సమస్యలు ఎదురయ్యేవే కావు. కానీ అప్పుడు ఆంధ్ర ప్రజల ఆగ్రహానికి భయపడి ఏపి రాజకీయ నేతలు అటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు కూడా చేయలేదు. దానితో కాంగ్రెస్ అధిష్టానం తనకి తోచినట్లు విభజన చేసేసి చేతులు దులుపుకొంది. అది చేసిన తప్పులకి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు మూల్యం చెల్లిస్తున్నాయి. అంతేకాదు.. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తరువాతైనా గత చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని రెండు రాష్ట్రాలలో నేతలు, మేధావులు చొరవ తీసుకొని ఈ సమస్యలన్నీ కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకోకుండా నేటికీ కీచులాడుకుంటూనే ఉన్నారు.

అందుకే కాకుల పోరు పిల్లి తీర్చినట్లు, రెండు తెలుగు రాష్ట్రాల పోరాడుకొంటుంటే కేంద్ర ప్రభుత్వం నీరో చక్రవర్తిలా వినోదం చూస్తోంది. ఈ సమస్యలకి పరిష్కారం ఢిల్లీలో లేదు, హైదరాబాద్ లోనే దొరుకుతుంది. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే టిడిపి, టిఆర్ఎస్ నేతలు, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు తమ అహాన్ని, బేషజాలని, స్వార్ధ రాజకీయాలని పక్కనబెట్టి కూర్చొని మాట్లాడుకొంటే పరిష్కారం కాని సమస్య లేదు. తెలుగు రాష్ట్రాల సమస్యల పట్ల అవగాహన లేని ఢిల్లీ లో  కూర్చొనే ఉత్తరాది అధికారులు, మంత్రులు చెప్పే మాటలకి రెండు రాష్ట్రాలలో నేతలు, అధికారులు బుర్రలు ఊపడం కంటే మనకి ఏది మంచో మనమే మాట్లాడుకొని నిర్ణయించుకోలేమా?