తెరాస ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎంసెట్-2 పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజ్ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు, తీవ్ర ఆరోపణలతో చాలా ఇబ్బంది పడుతోంది. ఎంసెట్-2ని రద్దు చేసి ఎంసెట్-3ని నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినప్పటికీ దానికీ కొందరు విద్యార్ధులు, వారి తల్లి తండ్రులు, ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత ఎదురవుతుండటంతో ఇబ్బంది పడుతోంది. ఈ కుంభకోణంపై సిఐడి దర్యాప్తుకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి గురించి, మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ వ్యవహారం గురించి తెరాస ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్న ప్రతిపక్ష పార్టీలు, దోషులని కాపాడేందుకే సిబిఐ విచారణ కోరడం లేదని వాదిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో దీనిపై హైకోర్టు విచారణ చేపట్టడంతో తెరాస ప్రభుత్వం ఇంకా ఇబ్బంది పడుతోంది. ఈరోజు మధ్యాహ్నంలోగా తెరాస ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పాలని ఆదేశిస్తూ హైకోర్టు విచారణని వాయిదా వేసింది. మరో వైపు లీకైనట్టుగా ఒప్పుకుంటూ ఎంసెట్ 2 పేపర్ ని రద్దు చేస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఈ పరిణామాలన్నీ తెరాస ప్రభుత్వానికి చాలా ఇబ్బంది మాత్రమే కాక చాలా అప్రతిష్ట కలిగించేవే. వీటి నుండి బయటపడేందుకు మరికొంత కాలం పట్టవచ్చు. కానీ ఈలోగా మళ్ళీ ఇటువంటి కొత్త సమస్యలేవీ సృష్టించుకోకుండా జాగ్రత్త పడితే చాలా మంచిది.
తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మాగ్నా ఇన్ఫో టెక్ అనే సంస్థ కేవలం తెలంగాణకే కాకుండా దేశంలోని చాలా రాష్ట్రాలలో జరిగే ఇటువంటి పరీక్షలకి సేవలు అందిస్తోంది. దానికి ప్రశ్నాపత్రాల ముద్రణ, వాటి పంపిణీతో ఎటువంటి సంబంధమూ లేదు. ఎంసెట్ పరీక్షల నిర్వహణకి ముందు తరువాత అవసరమైన సాఫ్ట్ వేర్ అందించడం వరకే దాని సేవలు పరిమితం. మరి అటువంటప్పుడు దానికీ, మాకు, ఈ లీకేజితో ఏ విధంగా సంబంధం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి? అవి రాజకీయ దురుదేశ్యంతోనే మా ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయి. ఇంతవరకు దేశంలో మొత్తం 80 సార్లు ఎంసెట్ ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యాయి. కానీ ఎప్పుడు ఏ మంత్రి రాజీనామా చేయలేదు. మా తప్పు లేనప్పుడు మేము ఎందుకు రాజీనామా చేయాలి?” అని ప్రశ్నించారు.
రాజేశ్వర్ రెడ్డి తన ప్రభుత్వాన్ని సమర్ధించుకొంటూ చాలా చక్కగానే వాదించినప్పటికీ, ఇటువంటి తప్పులు గతంలో చాలా సార్లు జరిగాయి కనుక ఇదేమీ పెద్ద తప్పు కాదు అన్నట్లు మాట్లాడటం చాలా తప్పు. ఎంసెట్ పరీక్షల నిర్వహణ పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే తప్ప దానికి సహకరిస్తున్న మాగ్నా ఇన్ఫో టెక్ వంటి సంస్థలది కాదు. కనుక ప్రభుత్వమే ఈ లీకేజ్ కి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ విషయం హైకోర్టు తేలుస్తుంది కనుక దాని గురించి చర్చించడం అనవసరం. షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి వంటి నేతలు తెరాస ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కనుక వాటికి ఆధారాలు కూడా వారే చూపించవలసి ఉంటుంది.