ఇసుక రీచుల్లో కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు

తెలంగాణ మంత్రి కెటిఆర్ కరీంనగర్‌లోని ఇసుక రీచ్‌ల్లో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కొత్తపల్లి ఇసుక రీచ్‌తో పాటు మోయతుమ్మెద వాగులో జరుగుతున్న మైనింగ్‌ను పరిశీలించారు.గత కొంత కాలంగా అక్కడ మైనింగ్ జరుగుతోందని పెద్ద ఎత్తున వార్తలు వస్తుండటంతో కేటీఆర్ స్వయగా రంగంలోకి దిగారు.  జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారంపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్‌పి జోయల్ డేవిస్, ఆర్‌డివొతో మాట్లాడి.. అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. 

ఇప్పటివరకు 40 లక్షల విలువైన ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా సీజ్ చేశామని చెప్పారు. ఇకపైనా దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మైనింగ్ లో అక్రమాలు జరుగనివ్వబోమని కేటీఆర్ తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఇతర మైనింగ్ ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని పేర్కొన్నారు. మరోపక్క గనుల శాఖ అధికారుల పనితీరుపై ఆ శాఖ మంత్రి కేటీ రామారావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శాఖపై కనీస అవగాహన, సమాచారం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.