కేసీఆర్ కేరాఫ్ యూటర్న్

మొన్నటి దాకా తిరుగులేని విధంగా సాగించిన కేసీఆర్ ప్రస్థానానికి కాస్త బ్రేకులు పడుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ సర్కార్ ఏర్పడినప్పటి నుండి పట్టపగ్గాల్లేని కేసీఆర్ ఇప్పుడు యూటర్న్ లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే స‌చివాల‌య త‌ర‌లింపు, ఉస్మానియా హాస్పిట‌ల్ కూల్చ‌డం, ఎర్ర‌గ‌డ్డ పిచ్చాసుప‌త్రి ని వికారాబాద్ త‌ర‌లించ‌టం, ఎన్టీఆర్ స్టేడియం ను క‌ళా భ‌వ‌న్ గా మార్చ‌టం లాంటి నిర్ణ‌యాలపై సిఎం యూటర్న్ తీసుకున్నారు. తాజాగా గోల్కొండ కోట విషయంలో కూడా యూట‌ర్న్ తీసుకోబోతున్నార‌ని తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి యేటా నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఈ యేడాది వేదిక మార్చాలన్నదే కేసీఆర్‌ ఆలోచనగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక మొదటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేదికగా గోల్కొండ కోటను ఫిక్స్ చేసి అక్క‌డ‌నే త్రివ‌ర్ణ ప‌త‌కాన్ని ఎగ‌ర‌వేసింది అంద‌రికి తెలిసిందే. రెండో యేడాది కూడా అక్క‌డినుంచే జెండా ఎగ‌ర‌వేశారు. కానీ ఈ సారి పంద్రాగ‌స్టును గోల్కొండ కోట‌లో కాకుండా ఎప్ప‌టిలాగానే పెరేడ్ గ్రౌండ్ లో చేయాల‌ని కేసీఆర్ కొంత మంది స‌హ‌చ‌రుల‌తో అన్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే రెండు సార్లు గోల్కొండ ఫోర్ట్ పై జెండా ఎగుర‌వేసిన కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకునే వెనుక ఏదో బ‌ల‌మైన కార‌ణం ఉండొచ్చ‌నే అనుమానాలు క‌లుగుతున్నాయి.

నిజాం కాలంలో గోల్కొండ కోట నిజాం న‌వాబు స్థావ‌రం అనేది అంద‌రికీ తెలిసిందే. నిజాం న‌వాబులు అక్క‌డి నుంచి తెలంగాణ‌ను పాలించి ప్ర‌జ‌ల‌ను రాచిరంపాన పెట్టారు. గోల్కొండ కోట అన‌గానే చాలా మందికి అప్ప‌టి దాష్టిక‌మే గుర్తుకు వ‌స్తుంది. ఇప్పుడు గోల్కొండ కోట‌పై కేసీఆర్ జెండా ఎగర‌వేయ‌టం దొర‌ల పాల‌న‌కు సంకేతంగా ప్ర‌తి ప‌క్షాలు ఆడిపోసుకుంటున్నాయి. కేసీఆర్ రెండున్న‌రేళ్ళ పాల‌న‌పై దొర‌ల పాల‌న అనే ముద్ర వేయ‌టంతో ప్ర‌తి ప‌క్షాలు స‌ఫ‌ల‌మ‌య్యాయి. దీంతో కేసీఆర్ పంద్రాగ‌స్టు అడ్డ‌ాను మార్చేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.