హరితహారంపై సిఎం కేసీఆర్ సమీక్ష

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంపై సిఎం కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. అధికారులు .. ప్రజా ప్రతినిధులు బాగానే పనిచేస్తున్నారని ఆయ‌న ప్రశంసించారు. కొద్ది మంది మాత్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌హ‌రించ‌డంపై సీఎం అసంతృప్తి వ్యక్తంచేశారు. హరితహారంలో ఎవరెవరు భాగస్వాములు కావడం లేదో ఈ సందర్భంగా కేసీఆర్‌ మంత్రులకు వివరించారు. హరితహారం కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకోవద్దని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత అంకిత భావంతో పనిచేయాలని సూచించారు.

మొక్కల పెంపకాన్ని శాశ్వత కరవు నివారణ చర్యల్లో భాగంగా చూడాలన్నారు. ప్రతి డివిజన్ కు అటవీశాఖ సీనియర్‌ అధికారిని నియమించి పర్యవేక్షించాలన్నారు. ఆగస్టు 15న హరితమిత్ర  అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ఈ సంద‌ర్బంగా కేసిఆర్ ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి ప్రతి రోజూ హరితహారం వివరాలను సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు హరితహారంపై సమీక్షించాలని సీఎంవో ప్రత్యేక కార్యదర్శిని ఆదేశించారు కేసిఆర్.