మల్లన్నసాగర్ సమస్యని ఎవరు జటిలం చేస్తున్నారు?

మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణపై రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య గత కొన్ని వారాలుగా యుద్ధం జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు ఈ సమస్యని రాజకీయంగా వాడుకోవాలని చూస్తుంటే, తెరాస ప్రభుత్వం వాటితో చర్చించి ఈ సమస్యని పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకుండా పంతానికి పోతోంది. అందుకే ఈ సమస్య ఇంకా జటిలం అవుతోంది. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు కొంచెం అతిగానే వ్యవహారిస్తున్నప్పటికీ, ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి వలన దానికి అప్రతిష్ట, ప్రతిపక్ష పార్టీలకి మంచి రాజకీయ మైలేజ్ లభిస్తోంది. అందుకే అవి ఇంకా రెచ్చిపోతున్నాయి.

ఇటువంటి సందర్భాలలో ప్రభుత్వం సంయమనం పాటించడం చాలా అవసరం. కానీ ప్రభుత్వ విప్ గొంగడి సునీత నల్గొండ జిల్లా ఆలేరులో నిన్న జరిగిన తెలంగాణ విద్యార్ధి, యువజన జేఏసి సదస్సులో ‘మల్లన్నసాగర్ ప్రాజెక్టుని అడ్డుకొంటున్న ప్రతిపక్ష పార్టీలని విద్యార్ధులు, యువత తరిమికొట్టాలని’ పిలుపునిచ్చారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి యువకులని ఆ విధంగా రెచ్చగొట్టడం సబబా కాదా? అనే విషయాన్ని పక్కనబెడితే, ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో ఆ విధంగా మాట్లాడితే సమస్య మరింత జటిలమవుతుందని గ్రహించకపోవడం మరో పొరపాటు. ఒకవేళ ఆమె మాటలకి విద్యార్ధులు ప్రభావితులై, ప్రతిపక్ష పార్టీల నేతలతో ఘర్షణ పడితే దాని వలన ప్రభుత్వానికి మరొక కొత్త సమస్య ఏర్పడే ప్రమాదం ఉంటుంది కదా?

మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ఇంత కాలం తెరాస నేతలు దూరంగా ఉన్నపుడు మంత్రి హరీష్ రావు ఒక్కరే స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. అది పరిష్కారం అవుతున్న సమయంలో తెరాస నేతలు ఈ విధంగా మాట్లాడి కొత్త సమస్యలు సృష్టించడం ఎందుకు? ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. అలాగే ప్రతిపక్ష నేతలు కూడా దీని నుంచి రాజకీయ మైలేజ్ పొందాలనే ఆశతో రాజకీయాలు చేయడం కంటే, ప్రభుత్వం చెపుతున్నట్లుగా నిజంగానే నిర్వాసితులకి న్యాయం జరుగుతోందా..లేదా అనేది తెలుసుకొని, అన్యాయం జరుగుతున్నట్లయితే నిర్వాసితులకి అండగా నిలబడి ప్రభుత్వంతో పోరాడినా ఎవరూ తప్పు పట్టరు.