వైసిపితో దోస్తీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి: సంజీవ రెడ్డి

కాంగ్రెస్ మాజీ ఎంపి, ఐ.ఎన్.టి.యు.సి. జాతీయ అద్యక్షుడు జి.సంజీవరెడ్డి ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వైసిపితో స్నేహం కోసం తమ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని, ఇప్పటికే వైకాపాతో చర్చలు జరుగుతున్నాయని, వాటిలో కొంత పురోగతి కనబడిందని చెప్పారు. ఆ ప్రయత్నాలు సఫలం అయ్యి రెండు పార్టీలు కలిసి పని చేయాలని తను కోరుకొంటున్నట్లు చెప్పారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపిలో దెబ్బతిన్న తమ పార్టీని కాపాడుకొనేందుకు తమ పార్టీ అధిష్టానం కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకోబోతోందని సంజీవ రెడ్డి చెప్పారు. దీని గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేనని అన్నారు.

ఏపిలో బలంగా ఉన్న వైసిపితో స్నేహం కోసం కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ఆరాటపడుతూనే ఉంది. అది సహజం కూడా. తెలంగాణలో వైసిపికి పెద్దగా బలం, ప్రజాధారణ లేవు. కాంగ్రెస్ కు ఆ రెండూ ఉన్నాయి. కనుక ఆ రెండు పార్టీలు ఒకదానికొకటి సహకరించుకొనేందుకు చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు. కనుక దాని కోసం తెర వెనుక చర్చలు జరుగుతున్నాయనే సంజీవరెడ్డి మాటలు నిజమనే భావించవచ్చు. బహుశః అందుకే తెలంగాణలో వైసిపి ఇటీవల కాలంలో మళ్ళీ యాక్టివ్ అయినట్లుంది.

ఒకవేళ వైసిపి అంగీకరిస్తే, జగన్ కి ఉన్న పాపులారిటీ వలన ఏపిలోను, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి ఉన్న పాపులారిటీ వలన తెలంగాణ లోను లబ్ది కలుగుతుందని కాంగ్రెస్ అధిష్టానం లెక్కలు వేసుకొంటోందేమో? కానీ ఏపిలో ప్రజలు అసహ్యించుకొంటున్న కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే వైసిపి కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇక తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వైసిపికి మద్దతు ఇచ్చినప్పటికీ, ప్రజలు దానిని పట్టించుకోకపోవచ్చు. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి కూడా తెలిసే ఉంటుంది. కనుక కాంగ్రెస్ తో స్నేహం చేసేందుకు ఇష్టపడతారో లేదో అనుమానమే!