మా రాష్ట్రం.. మా ఎగ్జామ్ అంటూ నిన్నటి దాకా బీరాలు పలికిన తెలంగాణ నాయకులకు ఎంసెట్ 2 ఒక్కసారిగా షాకిచ్చింది. తెలంగాణలో జరిగిన ఎంసెట్ పరీక్షపై పక్క రాష్ట్రం ఏపి నాయకులు జోకులు వేసుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. పక్క రాష్ట్రంలోలాగా తమ రాష్ట్రంలో ఎక్కడా తప్పులకు తావులేదు అని గర్వంగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఎంసెట్ 2లో భారీగా స్కాం జరిగిందని తేలిపోయింది. దీంతో కేసీఆర్ మరోసారి ఎంసెట్ పరీక్షను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆలోచించి ఓ నిర్ణయాన్ని తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆందోళన నేపథ్యంలో మరోసారి ఎంసెట్ ను నిర్వహించాలనుకొంటోంది. దీంతో వేలాది మంది విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు డైలమాలో పడ్డారు. ఎగ్జామ్ అంటే వేళాకోలమా అంటూ వాళ్లు నిలదీస్తున్నారు. వేల మంది హైదరాబాద్ లో తమ నిరసనను వ్యక్తం చేశారు. కానీ సర్కార్ మాత్రం న్యాయపరమైన చిక్కుల కోసం మరోసారి ఎంసెట్ నిర్వహించాల్సిందే అని ప్రకటించింది.
ఎంసెట్ పరీక్షను తిరిగి నిర్వహించాలనే నిర్ణయంపై వ్యతిరేకత వస్తుండటంపై ఓ మంత్రి విచిత్రంగా స్పందించారు. ‘‘ కేవలం 1500 మంది మాత్రమే ఎంసెట్ ను తిరిగి నిర్వహించడానికి వ్యతిరేకిస్తున్నారని, కానీ యాభై వేల మంది తిరిగి రాయడానికి సిద్ధంగా ఉన్నారని’’ అన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. విద్యార్థులు పరీక్షలు రాసే ప్రతి సారి వారి మీద ఒత్తిడి, వారి తల్లిదండ్రులు పడే కష్టం గురించి పట్టించుకోవాలి కదా. లీక్ అయినదానిపై చిక్కులు వస్తాయని ఇలా తిరిగి నిర్వహిస్తుంటే విద్యార్థులు ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ప్రతి విషయంలోనే క్లారిటీతో ముందుకెళ్లే కేసీఆర్ ఈ విషయంలొ ఎందుకు వెనకపడ్డారు. పైగా మంత్రుల మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలకు పూనుకోలేదు. గతంలో డిప్యూటీ సిఎం రాజయ్యపై నిమిషాల మీద డెసిషన్ తీసుకున్న కేసీఆర్, ఇప్పుడు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిల విషయంలో మాత్రం ఎందుకు తాత్సారం చేస్తున్నారు..? మరి ఇంత జరుగుతున్నా కానీ కేసీఆర్ మాత్రం మీడియా ముందుకు వచ్చి. పలానా తప్పు జరిగింది.. దానికి ఇది పరిష్కారం అని ఎందుకు ప్రకటించడం లేదు..? ఇప్పటికే కామెడీగా మారిన తెలంగాణ ఎంసెట్ లో ఇంకెంత కామెడీని కలుపుతారో మన పెద్దలు చూడాలి.