ఔషధాల్లో విశిష్టమైనది సంజీవిని. రామాయణంలో దీని ప్రస్తావన ఉంది. రావణాసురుడితో జరిగిన యుద్ధంలో లక్ష్మణుడు రాక్షసుల దాడిలో మూర్చపోగా.. హనుమంతుడు వెళ్లి సంజీవినిని తెచ్చి ఆయన తేరుకునేలా చేస్తాడు. అలాంటి అరుదైన మొక్క ఉత్తరాఖండ్‌లో ఉన్నట్టు ప్రచారంలో ఉంది. అక్కడి ప్రభుత్వం సంజీవిని మొక్క అన్వేషణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోంది. అయితే అత్యంత అరుదైన ఈ మొక్క మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో ఉన్నట్టు ఇప్పుడు గుర్తించారు. డిగ్రీ కళాశాలకు చెందిన వృక్షశాస్త్ర అధ్యాపకుడు సదాశివయ్య తిరుమలాయగుట్టపై సంజీవిని మొక్క ఉనికిని గుర్తించారు. దీన్ని అటవీశాఖ అధికారులు కూడా ధ్రువీకరించారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ మొక్కల శాంపిళ్లను పంపించామంటున్నారు.
ఎత్తయిన పర్వతాలపై మాత్రమే సంజీవిని మొక్క పెరుగుతుంది. దీన్నితెలంగాణలో పిట్టకాలుగా పిలుస్తారు. రాళ్ల పైన మొలిచే ఈ మొక్క 6, 7 నెలల పాటు నీరు లేకున్నా బతికేయగలదు. సంజీవిని మొక్కకు విశేషమైన ఔషధ గుణాలున్నాయి. తీవ్రమైన గాయాలకు, వడదెబ్బకు, దెబ్బ తిన్న కణజాలాన్ని మళ్లీ బాగు చేసేందుకు, ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని మళ్లీ మామూలు స్థితికి తీసుకువచ్చేందుకు, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు, జ్వరం, వాంతులు, రక్త సంబంధ వ్యాధులను నయం చేసేందుకు ఈ మొక్క ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఈ మొక్కపై దృష్టి పెడితే బాగుంటుంది.