తెలంగాణ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ లో సంబరాలు అంబరాన్నంటాయి. గోల్కొండ, పాతబస్తీ, సికింద్రాబాద్ లలో అయితే మహిళలు బోనాలతో పోటెత్తారు. చిన్నా పెద్దలు కలిసి బోనాలను ఎంతో వైభవంగా జరుపుకున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ముఖానికి అలంకరించిన బంగారు తాపడం అందరిని ఆకట్టుకుంది. ఇక బోనాల సందర్భంగా అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
తెల్లవారుఝామునుండి బోనాలతో, గండ దీపంతో మహిళలు అమ్మవారి ఆలయాలకు క్యూ కట్టారు. పాతబస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. తలపై బోనాలతో ఊరేగింపుగా వచ్చి మహిళలు తమ మొక్కులు తీర్చుకున్నారు. డప్పు వాయిద్యాలు, పోతురాజుల వీరంగాలు, శివసత్తుల పూనకాలు, యువకుల డ్యాన్సులు, తెలంగాణ సంస్రృతిని చాటేలా పలు కార్యక్రమాలు అందరికీ ఆనందాన్ని పంచాయి.