ఎంసెట్ స్కాంలో కెసిఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉంది: రేవంత్ రెడ్డి

తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎంసెట్ కుంభకోణంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. ఈ కుంభకోణంపై సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులు కడియం శ్రీహరి, డా.లక్ష్మా రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తక్షణమే రాజీనామాలు చేయాలని, వారిపై కూడా సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ కుంభకోణం బయటపడినప్పుడు, దానిలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల హస్తం ఉన్నట్లు నిరూపించే ఒక ఆధారం కనబడినప్పుడు వాటిని కడియం శ్రీహరి తేలికగా కొట్టి పడేయడం అనుమానాలకి తావిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు.

ఎంసెట్ పేపర్ల ముద్రణ కాంట్రాక్ట్ కోసం టాటా అనుబంధ సంస్థ కూడా ప్రయత్నించింది కానీ టెండర్లు లేకుండా ఢిల్లీ సంస్థకి కట్టబెట్టినందుకు, అది పాపిరెడ్డికి లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసినప్పుడు, ముఖ్యమంత్రి బంధువు ఆదేశాల మేరకు పని కేటాయించామని, కనుక దానిలో కలుగజేసుకోవద్దని చెప్పినట్లు తెలిసింది. అప్పుడే ఈ కుంభకోణానికి బీజం పడిందని అర్ధమైంది అని రేవంత్ రెడ్డి అన్నారు.    

కెసిఆర్ తన కుటుంబ సభ్యులని, మంత్రుల్ని కాపాడుకొనేందుకు, ఈ కేసుని బ్రోకర్లు, ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు, విద్యార్ధులు, వారి తల్లితండ్రులని ప్రధాన దోషులుగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇవే కాకుండా రేవంత్ రెడ్డి మరికొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అవేమిటంటే:

1. సాధారణంగా ఎంసెట్ ప్రశ్నాపత్రాల ముద్రణకి టెండర్లు పిలిచి ప్రతీసారి వేర్వేరు సంస్థలకి ఆ బాధ్యత అప్పగిస్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వం టెండర్లు పిలువకుండా 2014-15, 2015-16 సం.లలో ఒకే ముద్రణ సంస్థకి ఈ పని ఎందుకు అప్పగించింది?

2. ఆ ముద్రణ సంస్థని ఎస్.ఎస్.సి. మరియు ఇంటర్ బోర్డులు బ్లాక్ లిస్టులో పెట్టినప్పుడు, మళ్ళీ దానికే ఈ పని ఎందుకు కట్టబెట్టారు?

3. ఈ కుంభకోణం బయటపడినప్పుడు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, పాపిరెడ్డి ఇద్దరూ దానిపై విచారణ జరిపిస్తామని చెప్పకుండా, ఎటువంటి లీకేజ్ జరుగలేదని దానిని దాచిపెట్టే ప్రయత్నం ఎందుకు చేశారు?

4. అ డిల్లీ సంస్థకే ముద్రణ పని అప్పగించేందుకు ఎవరెవరు సిఫార్సు చేశారు? వాటిని ఎవరు ఆమోదించారు? దీనిలో జె.ఎన్.టి.యు.-హెచ్ అధికారుల పాత్ర ఏమిటి?

5. ఈ పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు సాంకేతిక కారణాల చేత బయోమెట్రిక్ పద్ధతి పని చేయలేదని అధికారులు చెప్పారు. అది లేకుండానే సుమారు 2500 మంది విద్యార్ధులని ఏ విధంగా పరీక్షలు వ్రాయడానికి అనుమతించారు? దానికి కారాణాలు ఏమిటి? బయోమెట్రిక్ పనిచేయనప్పుడు ఓ.ఎం.ఆర్. షీట్లని ఎందుకు మార్చలేదు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నలు సంధించారు.  

రేవంత్ రెడ్డి అడుగుతున్న ఈ ప్రశ్నలు, చేస్తున్న ఆరోపణలు చాలా తీవ్రమైనవే కనుక వాటికి సమాధానాలు కనుగొని ఈ కుంభకోణం అసలు నేరస్తులని పట్టుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకి ఆదేశించడమే మేలేమో?