ఏఎన్-32 విమానం ఇక దొరకనట్లేనా?

భారత్ వాయుసేనకి చెందిన ఏఎన్-32 రవాణా విమానం జూలై 22న తమిళనాడులో తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ కి బయలుదేరిన 20 నిమిషాల తరువాత మాయం అయిపోయింది. అప్పటి నుంచి దాని కోసం నావికాదళానికి చెందిన నౌకలు, హెలికాఫ్టర్లు, విమానాలు, ఒక సబ్ మెరైన్ బంగాళాఖాతంలో విమానం పడిపోయినట్లు అనుమానిస్తున్న 15,000 చదరపు కిమీ ప్రాంతాన్ని గాలిస్తున్నాయి. కానీ నేటికీ దాని జాడ కనుక్కోలేకపోయారు. అంత పెద్ద విమానం ఎక్కడా కనబడకుండా మంత్రం వేసినట్లు మాయమైపోవడం, దానిని ఎంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వెతుకుతున్నా కనుగొనలేకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. దానిలో 25మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కలిపి మొత్తం 29మంది ఉన్నారు. సముద్రాన్ని జల్లెడ పడుతున్నా వారి గురించి ఏ చిన్న ఆచూకీ దొరకలేదు.

ఈ సమయంలో రెండు ఆసక్తికరమైన విషయాలు బయటకి వచ్చాయి. ఆ విమానం మాయం అయిన నాలుగు రోజుల తరువాత, అంటే జూలై 26న అదే విమానంలో ప్రయాణిస్తున్న తమ కుమారుడు మొబైల్ ఫోన్ కి కాల్ చేస్తే అది రింగ్ అయిందని, ఒకరు తమిళనాడులో అధికారులకి సమాచారం ఇచ్చారు. దాని ఆధారంగా ఆ విమానం చివరిసారి ఎక్కడ ఉందో కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఆ విమానం సముద్రంలో కూలిపోయుంటే నాలుగు రోజుల తరువాత ఆ సెల్ ఫోన్ పనిచేసే అవకాశమే ఉండదు. కనుక సముద్రంలో కాకుండా వేరే ఎక్కడైనా కూలిపోయిందా లేకపోతే ఉగ్రవాదులు దానిని దారి మళ్ళించుకొని ఎత్తుకుపోయారా? అనే అనుమానం కలుగుతోంది.

ఇక కొత్తగా తెలిసిన మరో విషయం ఏమిటంటే, కేరళలో అలెప్పి సముద్రతీరంలో నాలుగు రోజుల క్రితం ఒక విమానశకలం కనబడింది. కానీ విరిగిన ఒక రెక్క ముక్క మాత్రమే కనబడింది. అది పౌర విమానం కాదు. దానిపై ఇజ్రాయిల్ దేశానికి చెందిన వివరాలు ఏవో ఉన్నట్లు గుర్తించారు. వాయుసేన అధికారులు అక్కడికి చేరుకొని దానిని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పూణేలో నివసిస్తున్న ఆ విమాన పైలట్ కునాల్ బర్పట్టే కుటుంబ సభ్యులని రక్షణమంత్రి మనోహర్ పారిక్కర్ శనివారం పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, విచారం వ్యక్తం చేసి, ఆ విమానం కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. దాని ఆచూకి కనుగొనేందుకు అమెరికా సహాయం కోరుతామని చెప్పారు. అంటే ఇంతవరకు లభించిన ఆ రెండు ఆధారాలు ఆ విమానం జాడ కనుగొనేందుకు ఉపయోగపడలేదని స్పష్టం అయ్యింది. కనుక అది ఇంకా ఎప్పటికి దొరుకుతుందో, అసలు దొరుకుతుందో లేదో కూడా ఎవరికీ అంతు చిక్కకుండా ఉంది.