నిన్న మొన్నటి వరకు పూలనావలా సాగిపోయిన టిఆర్ఎస్ సర్కార్ కి ఒకేసారి చాలా కష్టాలు చుట్టుముట్టాయి. సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్ష పార్టీల పోరాటాలు, తెలంగాణ యూనివర్సిటీల వైస్-ఛాన్సిలర్ల నియామకం విషయంలో హైకోర్టు చేత మొట్టికాయలు, ఎంసెట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం, కాంగ్రెస్ నేతల మల్లన్నసాగర్ పర్యటనలు వగైరాలు ఒకదాని తరువాత మరొకటి వచ్చేశాయి. ఒకదానితో మరొకటి సంబందం లేకపోయినప్పటికీ అన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో ప్రభుత్వానికి ఊపిరి ఆడటం లేదు. అదృష్టం కొద్దీ తెలంగాణ న్యాయవాదుల సమ్మె ముగిసిపోయింది లేకుంటే ఈ కష్టాల జాబితాలో అది కూడా ఉండేది.
విసిల నియామకం లో హైకోర్టు చేత మొట్టికాయలతోనే బయటపడినప్పటికీ, తెలంగాణ రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వంటి మేధావులు చేస్తున్న వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లు అవుతోంది. విద్యావ్యవస్థ పై, ముఖ్యంగా తెలంగాణలో కార్పరేట్ కళాశాలలపై తెరాస ప్రభుత్వానికి అసలు పట్టులేదని, యూనివర్సిటీలని నిర్లక్ష్యం చేయడంతో అవి గాడి తప్పాయని విమర్శించారు. ఎంసెట్ పేపర్లు లీక్ వ్యవహారంలో ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత కనుక సంబంధిత మంత్రులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తే బాగుంటుందని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా అతిగా చేస్తోందని, మళ్ళీ త్వరలోనే తాము అక్కడికి పర్యటన చేస్తామని కోదండరాం ప్రకటించారు.
మల్లన్నసాగర్ నిర్వాసితులని కలవాలంటూ కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్లలలో, కోర్టులలో చేస్తున్న హడావుడి కూడా ప్రభుత్వానికి చాలా తలనొప్పిగా మారింది. “ప్రభుత్వం ఏ తప్పు చేయకపోతే అక్కడికి ఎవరినీ వెళ్ళనీయకుండా ఎందుకు అడ్డుపడుతోంది?” అని వారు అడుగుతున్న ప్రశ్నలకి ప్రభుత్వం వద్ద జవాబు లేదు.
సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ న్యాయవాదులు కూడా మల్లన్నసాగర్ కి బయలుదేరితే వారిని పోలీసులు ఒంటిమామిడి గ్రామం వద్ద అడ్డుకోవడంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. ప్రభుత్వానికి న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థ రెండు కళ్ళ వంటివి. వారి మధ్య కూడా ఘర్షణలు జరుగుతుండటం ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇదివరకు చండీయాగాలు చేసిన తరువాతే రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా ఆయనకి అనుకూలంగా మారాయి. కనుక ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఆయన మళ్ళీ మహా చండీయాగమో మరొకటో చేయక తప్పదేమో?