తెలంగాణ టిడిపి అధ్యక్షుడు అస్త్రసన్యాసం?

తెలంగాణలో తెరాస చాలా బలంగా ఉన్నప్పటికీ, ఓటుకి నోటు కేసు బయట పడనంత వరకు టిడిపి కూడా చాలా బలంగానే ఉండేది. ఆ తరువాతే దాని పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నేటికీ అది తెరాస ప్రభుత్వంతో గట్టిగానే పోరాడుతున్నప్పటికీ అది కేవలం తన ఉనికిని చాటుకోవడానికి లేదా మనుగడ కోసం చేస్తున్న పోరాటమే తప్ప ఇదివరకు లాగా తెరాసని ఢీ కొంటూ చేస్తున్న పోరాటంగా భావించలేము.

రాష్ట్రంలో టిడిపి అంటే ఇప్పుడు రెండే పేర్లు వినబడుతుంటాయి. 1.ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ. 2.వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. వారిద్దరిలో రేవంత్ రెడ్డి గొంతు మాత్రమే కొంచెం గట్టిగా వినిపిస్తుంటుంది. ఎల్.రమణ పార్టీ అధ్యక్షుడైనప్పటికీ, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి చూసి చాలా నిరుత్సాహంగా ఉన్నారు. అలాగని పార్టీ మారే ఆలోచన కూడా చేయడం లేదు. చేసి ఉంటే ఇటీవల తెరాస ఇచ్చిన బంపర్ ఆఫర్ అందుకొని గోడ దూకేసేవారే. కానీ టిడిపితో అనుబంధం తెంచుకోలేక తెరాస ఆఫర్ ని తిరస్కరించినట్లు సమాచారం. మరో తాజా సమాచారం ఏమిటంటే వచ్చే ఎన్నికలలో ఆయన పోటీ చేయదలచుకోలేదుట! పార్టీ మారకుండా, ఎన్నికలలో పోటీ చేయకపోతే మరేం  చేయాలనుకొంటున్నారు అంటే రాజ్యసభ సీటు కానీ లేదా మరేదైనా నామినేటడ్ పదవి గానీ ఇప్పిస్తే ఢిల్లీ వెళ్లిపోవాలనుకొంటున్నారుట! చంద్రబాబు కూడా ఆయన పట్ల మంచి అభిప్రాయమే కలిగి ఉన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అర్ధం చేసుకోగలరు. కానీ పార్టీ అధ్యక్షుడే ఈ విధంగా అస్త్రసన్యాసం చేస్తే ఇక పార్టీకి ఎవరు దిక్కు? ఏ విధంగా మనుగడ సాగిస్తుంది? అనే ఆలోచనతో ప్రస్తుతానికి రమణకి ఎటువంటి హామీ ఇవ్వలేదు.

టిడిపిని జాతీయ పార్టీగా ప్రకటించుకొని, దానికి చంద్రబాబు జాతీయ అధ్యక్షుడుగా ఉంటూ, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ఇరుగుపొరుగు రాష్ట్రాలకి కూడా విస్తరించాలనుకొంటుంటే, ఎంతో కొంత బలంగా ఉన్న తెలంగాణాలోనే పార్టీ మూతపడే పరిస్థితి కనబడుతోంది. మరో విచిత్రం ఏమిటంటే, రాష్ట్రంలో ఏమాత్రం బలం, ప్రజాధారణ లేని వైసిపి, మళ్ళీ లేచి నిలబడే ప్రయత్నం చేస్తుంటే, రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్, మంచి బలమైన నాయకులు ఉన్న టిడిపి అస్త్రసన్యాసానికి సిద్ధపడుతోంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఎన్ని పార్టీలు మిగిలి ఉంటాయనే విషయంపై పూర్తి స్పష్టత రావచ్చు.