తెలంగాణకూ ప్రత్యేక హోదా?!

ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని గత నాలుగు రోజులుగా పార్లమెంట్ సాక్షిగా నడుస్తున్న గొడవ మరో కీలక మలుపు తిరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలు ఏపి, తెలంగాణగా విడిపోయిన సందర్భంగా తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా అవసరం అని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఏపికి ప్రత్యేక హోదాపై గంటలు గంటలు మాట్లాడుతున్న నాయకులు తెలంగాణ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. 

ప్రపంచవ్యాప్తంగా పేరు మోసిన ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు ఏపీ వారేనని, 35 లక్షల కోట్ల నిక్షేపాలు ఉన్న సముద్ర తీర ప్రాంతం ఆ రాష్ట్రానికి  ఉందని గుర్తు చేశారు. అలాంటి రాష్ట్రానికే ప్రత్యేక హోదా అవసరమైనప్పుడు, గత 60 సంవత్సరాలుగా వలస పాలకుల పాలనలో సర్వం నష్టపోయిన తెలంగాణకు ప్రత్యేక హోదా గురించి సీపీఎం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.