ఎంసెట్2 రద్దుకే కేసీఆర్ మొగ్గు

తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కలకలానికి కేంద్రంగా మారిన ఎంసెట్ 2 లీక్ పై సిఎం కేసీఆర్ సుధీర్ఘంగా చర్చించారు. తన నివాసంలో దాదాపుగా నాలుగు గంటలు చర్చించిన కేసీఆర్ చివరకు పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాష్ట్రాలు ఎలా వ్యవహరించాయి, కోర్టు తీర్పులు ఎలా ఉన్నాయి అన్న దానిపై సీఎం పలు సూచనలు తీసుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు దాదాపు 80సార్లు ఇలా పరీక్షాపత్రాల లీక్ లు జరిగితే దాదాపుగా అన్ని సందర్భాల్లో పరీక్షను మళ్లీ నిర్వహించినట్లు అధికారులు సూచించారు. 

ఈ ఘటన తర్వాత ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలిసింది. ఎంతో మంది విద్యార్థులను క్షోభకు గురిచేసిన ఎంసెట్ లీకేజ్ పై  సర్కార్ సీరియస్ గా ఉంది. దీనికి కారణం ఎవరైనా కూడా వదిలేది లేదని స్పష్టం చేసింది. అక్రమ మార్గంలో తమ పిల్లలను అందలం ఎక్కించాలనుకున్న వారిని, విద్యార్థులను, వారికి సహకరించిన వాళ్లకు కఠిన శిక్షలు విధించేందుకు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. భవిష్యత్తులో ఇటువంటి నేరానికి పాల్పడాలంటే భయపడే విధంగా ఆ శిక్షలు అమలు చేయాలని సీఎం నిర్ణయించినట్టు తెలిసింది.