లోకేష్ చెప్పిన ఆ తెలంగాణ మంత్రి ఎవరు?

టీడీపీ నుండి టీఆర్ఎస్ లోకి చేరిన ఒక మంత్రి ఇటీవల లోకేష్ కి కాల్ చేసి తన గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ మంత్రి ఎవరో విశ్లేషించి చూద్దాం. 

తెదేపా నుంచి తెరాసలో చేరి మంత్రులయినవారు ముగ్గురు ఉన్నారు. వారు తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావు, కడియం శ్రీహరి. వారిలో తలసాని తరచూ మీడియా ముందుకు వచ్చి ప్రతిపక్ష పార్టీలని వాటిలో ఒకటైన తెదేపాని విమర్శిస్తుంటారు. అవకాశం చిక్కినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా విమర్శిస్తుంటారు. కనుక లోకేష్ చెపుతున్న మంత్రి ఆయన కాకపోయుండవచ్చు.

తుమ్మల నాగేశ్వర రావు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తో ఆయనకి మంచి అనుబంధమే ఉంది. ఆయన పట్ల కెసిఆర్ కి చాలా గౌరవం కూడా ఉంది. ఖమ్మం జిల్లాపై తుమ్మలకి చాలా పట్టుంది కనుక అక్కడ బలహీనంగా ఉన్న తెరాసని బలోపేతం చేసుకోవడానికే, ఆయనని పార్టీలోకి ఆహ్వానించి, వెంటనే మంత్రి పదవి కూడా ఇచ్చారు. కెసిఆర్ కి వాస్తు నమ్మకాలు ఎక్కువ కనుక, ఆయన మంత్రిత్వ శాఖలో ఒక వాస్తు స్పెషలిస్టుని ‘ప్రభుత్వ సలహాదారు’ హోదాలో నియమించినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. ఆ వాస్తు స్పెషలిస్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనిదే, రోడ్లు భవనాల శాఖలో ఏ పని జరుగదని, ఆ కారణంగా మంత్రి తుమ్మల చాలా అసంతృప్తితో ఉన్నట్లు గుసగుసలు వినిపించాయి. కానీ ఆ కారణంగా తుమ్మల తన గోడుని నారా లోకేష్ కి మోర పెట్టుపెట్టుకొంటారనుకోలేము. కనుక లోకేష్ చెపుతున్న వ్యక్తి ఆయన కూడా కాదని భావించవచ్చు.

ఇక మిగిలింది కడియం శ్రీహరి. ఆయన ఉన్నత విద్యాశాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా రెండు కీలక పదవులు నిర్వహిస్తున్నప్పటికీ, ఏనాడు ఆయనకి తెరాస పార్టీలో కానీ, ప్రభుత్వంలోగానీ తగినంత గుర్తింపు, గౌరవం దక్కినట్లు కనబడదు. ఆయన దళితుడు కావడం వలన వివక్షకి ఒక కారణం అయ్యుండవచ్చు. కానీ నిజంగా ఆయన అసంతృప్తితో ఉన్నారా లేదా? ఆయనే లోకేష్ తో మాట్లాడారా? అనేది చెప్పలేము. ఎందుకంటే కడియం శ్రీహరి ఎన్నడూ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయలేదు. కనుక ఫిరాయింపులని ప్రోత్సహించి, తమ పార్టీని ఘోరంగా దెబ్బ తీసిన తెరాసని దెబ్బ తీసేందుకే నారా లోకేష్ ఆ విధంగా మాట్లాడి ఉండవచ్చు. కానీ లోకేష్ చెప్పింది నిజమే అయితే, టీఆర్ఎస్ మంత్రి నిజంగానే ఆయనతో మాట్లాడారంటే మాత్రం, అది చాలా ఆలోచించవలసిన విషయమే.