ఏపి రాష్ట్ర విభజన తర్వాత గత కొంత కాలంగా ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా కష్టపడుతున్న ఏపికి బాసటగా నిలుస్తోంది టిఆర్ఎస్. తాజాగా పార్లమెంట్ లో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో టిఆర్ఎస్ మద్దతునిచ్చింది. ఏపి పునర్విభజన చట్టంలోని అన్ని అంశాలను ఖచ్చితంగా అమలు చెయ్యాలని, ఏపికి ప్రత్యేక హోదా కూడా కల్పించాలని టిఆర్ఎస్ తరఫున కేకే పార్లమెంట్ లో పార్టీ విధానాన్ని డిక్లేర్ చేశారు.
ఏపీ సోదరులు ఏం డిమాండ్ చేస్తున్నారో వాటికి తాము మద్దతు పలుకుతున్నామన్నారు టీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావు. పార్లమెంట్ లో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో తెలంగాణ సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తూ, ఇప్పటికీ ఉద్యోగులు విభజన పూర్తి కాలేదన్నారు. దీంతో తెలంగాణలో చాలా మంది ఉద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని కేకే వివరించారు.