కేసీఆర్ పై లోకేశ్ కౌంటర్

గత కొంత కాలంగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రతిపక్ష పార్టీలకు తాజాగా తెలంగాణ సర్కార్ విమర్శలకు అవకాశమిచ్చింది. మల్లన్నసాగర్ నుండి తాజాగా ఎంసెట్ పరీక్ష అంశం వరకు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదుకోవడం లేదు ప్రతిపక్షపార్టీలు. నారా లోకేష్ మరోసారి తెలంగాణ సిఎం కేసీఆర్ పై విమర్శల దాడి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉండేదని కానీ ఇప్పుడు మాత్రం లోటు బడ్జెట్ లోకి వచ్చిందని.. సిఎం అంటే కష్టపడాలని అంతే కానీ ఫాంహౌజ్ లో కూర్చుంటే ఇలానే ఉంటుందని సెటైర్ వేశారు. 

‘‘టీడీపీ నుంచి టీఆర్‌ఎస్ లో చేరిన ఒకాయన ఇటీవల నాకు పదేపదే ఫోన్ చేశాడు. ఓసారి మాట్లాడితే పోలా.. అని ఫోన్ ఎత్తి, అన్నా బాగున్నావా? అని అడిగిన. ఏం బాగున్నమన్నా, ఇక్కడేం బాగలేదు. పార్టీలో చేరే ముందు సీఎం కేసీఆర్‌ నాతో మూడు గంటలు మాట్లాడిండు. చేరినప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌ కూడా ఇచ్చిండు. ఇగొ ఇప్పటి వరకు మళ్ల కలవనియ్యలే. అంటూ తన గోడు వెళ్లబోసుకున్నడు’’ అని లోకేశ్ తెలిపారు. ‘‘మరి, మీ ఇంఛార్జి మంత్రితో మాట్లాడకపోయినవా? అంటే.. అన్నా, నీకు నోరున్నది నాకు చెప్పుకున్నవు. నేను మంత్రిని. నాకు నోరు లేదు. అంటూ సదరు మంత్రి జవాబిచ్చారని ఆ నాయకుడు వాపోయినడు’’ అని లోకేశ్ వివరించారు. 

ప్రతి విషయంలోనే ఆంధ్రాపార్టీ అడ్డుపడుతోందని కేసీఆర్ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. నీళ్లు రాకున్నా, విద్యుత్తు రాకున్నా ఆ తప్పును వేరేవాళ్లపై తొయ్యడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని అన్నారు. మరి దళితులకు మూడెకరాలు పంపిణీకి, మైనారిటీలు, ఎస్టీలకు రిజర్వేషన్లకు కూడా ఆంధ్రాపార్టీ అడ్డుపడుతోందా? అని లోకేశ్‌ నిలదీశారు. లోకేశ్ మాట్లాడిన మాటల్లో నిజం ఉంది. దీనిపై కేసీఆర్, తెలంగాణ సర్కార్ ఏం సమాధానం చెబుతుందో చూడాలి.