తెలంగాణ రాష్ట్రంలో కోట్ల మంది విద్యార్థులతో ముడిపడిన ఎంసెట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షపత్రం లీకేజ్ పై విద్యార్థుల తల్లిదండ్రులు కదం తొక్కారు. ఎవరో చేసిన తప్పుకు తమ పిల్లలను ఎందుకు బలి చేస్తున్నారంటూ వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలతో కలిసి నిరసనకు దిగారు. ప్రభుత్వం నిర్లక్షం కారణంగా జరిగిన తప్పుకు పిల్లల భవిష్యత్తును పణంగా పెడతారా..? అని తెలంగాణ సర్కార్ ను నిలదీస్తున్నారు. ఎంసెట్3 పరీక్షను పెడితే మాత్రం తాము రాసేది లేదని విద్యార్థులు తేల్చిచెబుతున్నారు.
న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా దీనికి పరిష్కారాన్ని కనుగొనాలని చూస్తోంది. కాగా ఇప్పటికే జులై నెల ముగియడంతో ప్రభుత్వం మీద తీవ్ర వత్తిడి మొదలైంది. ఎంసీఐ(మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) రూల్స్ ప్రకారం మెడికల్ అడ్మిషన్లు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చెయ్యాలి. కానీ ఇప్పటికిప్పుడు ఎంసెట్ 3 నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష నిర్వహించినా కూడా వైద్య సీట్ల భర్తీ సెప్టెంబర్ 30 నాటికి పూర్తయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారనుంది.
రేవంత్ రెడ్డి కి సందు దొరికింది
ఇక మరో వైపు రేవంత్ రెడ్డి విషయానికొస్తే, సందెప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు కేసిఆర్ తో ఆడుకుందామా ఎదురుచూసే ఈ ప్రతిపక్ష నేత ఎంసెట్ లీకేజి పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఎంసెట్-2 పేపర్ లీక్‌లో ప్రభుత్వమే ముద్దాయి అని, సీఎం ఫ్యామిలీకి చెందిన వ్యక్తుల మిత్రుల పాత్ర ఉందని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. దీనిపై సిఐడీతో కాకుండా సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఎంసెట్ 2 పరీక్షపత్రం లీక్ వ్యవహారంలో కడియం శ్రీహరిని కేబినెట్ నుండి బర్తరఫ్ చెయ్యాలని, లక్ష్మారెడ్డితో సహా అందరిపైన కేసు నమోదు చేసి విచారించాలని రేవంత్ డిమాండ్ చేశారు. తెలంగాణ సర్కార్ తీరు మేకలను బలిచ్చి.. మేకలను వెనకేసుకువచ్చినట్లుంది అని అన్నారు. దళారులను జైలుకు పంపి చేతులు దులుపుకుంటే సరిపోదని, కుంభకోణం మూలాలు ఢిల్లీ, బెంగళూరులో ఉన్నాయని, దానిపై పూర్తి స్థాయి విచారణ చేసి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని అన్నారు.