ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో గురువారం సాయంత్రం చర్చ జరిగింది. ఆ చర్చలో పాల్గొన్న అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా విభజన హామీలన్నిటినీ ఖచ్చితంగా అమలుచేయాలని గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. యూపి, బీహార్, పశ్చిమబెంగాల్ సభ్యులు తమ రాష్ట్రాలు కూడా చాలా వెనుకబడి ఉన్నాయి కనుక కేంద్ర ప్రభుత్వం తమని కూడా ఆదుకోవాలని కోరారు.  అంతే గాక, ఏపితో పాటు తెలంగాణ లో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సహాయం చేయమని వారు కోరధం విశేషం.  

వారిలో నరేష్ అగర్వాల్ అనే సభ్యుడు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని పొగడ్తల్లో ముంచెత్తారు. ఆయన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేసుకొనే ప్రయత్నాలు చేస్తునట్లు విన్నానని అన్నారు. మోడీ ప్రభుత్వం ఆయనకీ అన్ని విధాల సహాయ పడాలని కోరారు.

వైకాపా సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రైవేట్ బిల్లుని ద్రవ్యబిల్లుగా పరిగణించాలనే ఆర్ధికమంత్రి జైట్లీ ఆలోచనని తప్పు పట్టారు. దానిపై వాదనతోనే కొంత సమయం వృధా చేసుకొని అసలు పాయింట్లు మాట్లాడలేకపోయారు. అయన చంద్రబాబుని విమర్శించడం మొదలుపెట్టగానే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆయనని అడ్డుకొన్నారు.

కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్ తనకిచ్చిన సమయాన్ని చాలా చక్కగా వినియోగించుకొని ఆనాడు తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలని, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని, దానితో బాటే ఐదేళ్ళు చాలదు పదేళ్ళు కావాలన్న వెంకయ్య నాయుడు డిమాండ్ ని గుర్తు చేసి, ఆ హామీలని ఇంకా ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు.

రెండేళ్లలో ప్రత్యేక హోదా, హామీల అమలు గురించి ఇదే పార్లమెంటులో చాలాసార్లు చర్చలు జరిగాయని, అవి కార్యరూపం దాల్చకపోతే విలువైన సభా సమయం వృధా చేసుకొన్నట్లేనని, ఈ సభలో జరిగే చర్చలన్నీ తమని మభ్యపెట్టడానికి మాత్రమేనని ప్రజలు అనుమానించే ప్రమాదం ఉంది కనుక ఏవో కుంటిసాకులు చెప్పి హామీలు అమలుచేయకుండా తప్పించుకొనే ప్రయత్నాలు చేయవద్దని కెవిపి రామచంద్ర రావు కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు.          

ఈ చర్చకి కారణమైన ప్రైవేట్ బిల్లుని ఆగస్ట్ 5న చర్చ చేపట్టి, అదే రోజు దానిని ముగిస్తానని కురియన్ చెప్పడంతో ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అప్పుడు ఆయన మళ్ళీ వివరణ ఇస్తూ కెవిపి రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రైవేట్ బిల్లు ఇప్పుడు సభ ఆస్తిగా పరిగణించబడుతుంది కనుక దానిని సభ ఆమోదిస్తే ఓటింగ్ చేపడతానని, తిరస్కరిస్తే తానేమీ చేయలేనని చెబుతూ, తానేమీ అ బిల్లుని తిరస్కరించడం లేదని గుర్తుచేశారు. కానీ ఆయన మాటలలో మోడీ ప్రభుత్వ ఆలోచన బయటపడింది. ఆ రోజున సభ చేత ఆ బిల్లుని తిరస్కరింపజేసి చెత్తబుట్టలోకి పంపేయబోతున్నట్లు భావించవచ్చు.