తెలంగాణకి మోడీ మొక్కుబడి పర్యటన!

ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్ట్ 7న గజ్వేల్ పర్యటన ఖరారు అయింది. ఆయన పర్యటన తేదీ, వివరాలని ఖరారు చేస్తూ ప్రధాని కార్యాలయం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు సమాచారం అందింది. ఆగస్ట్ 7న మధ్యాహ్నం 3.30 గంటలకి హైదరాబాద్ నుంచి గజ్వేల్ హెలికాఫ్టర్లో ప్రధాని చేరుకొంటారు. అక్కడ మిషన్ భగీరథ పధకాన్ని ప్రారంభం చేసిన తరువాత మళ్ళీ సాయంత్రం 5.00 గంటలకి హైదరాబాద్ చేరుకొని రాష్ట్ర భాజపా నేతలతో సమావేశం అయ్యి, అటు నుండి   రాత్రి 7.30 గంటలకి మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతారు. అంటే ఆయన తెలంగాణ గడ్డపై కేవలం 4 గంటలు మాత్రమే ఉంటారన్న మాట! అందులో అధికారిక కార్యక్రమాల కోసం ఆయన కేటాయించిన సమయం కేవలం గంటన్నర మాత్రమే!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా ఆయన రాష్ట్రానికి వస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఆయన చేతుల మీదుగానే వరంగల్లో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, రామగుండం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంకి శంఖుస్థాపన చేయించాలనుకొంది. ఆయన సమయం కేటాయిస్తే ఇంకా మరికొన్ని అభివృద్ధి, సంక్షేమ పధకాలకి కూడా ఆయన చేతనే శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయించాలనుకొంది. అలాగే ములుగు మండల కేంద్రంలో ఒక బహిరంగ సభ కూడా నిర్వహించాలనుకొంది. కానీ ఆయన తెలంగాణకి కేవలం గంటన్నర సమయం మాత్రమే కేటాయించడంతో అవన్నీ రద్దయ్యాయి. కనుక రాష్ట్రంలో ఆయన మొట్టమొదటి పర్యటన మొక్కుబడి పర్యటనగా ఎటువంటి ప్రాధాన్యత, ప్రభావం చూపలేని పర్యటనగానే మిగిలిపోవచ్చు.  

ఆయన తొలసారిగా రాష్ట్రం వస్తున్నప్పుడు, కనీసం ఒక్కరోజు పూర్తిగా సమయం కేటాయించి ఉండి ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం అనుకొన్న ప్రకారం సాగి ఉండి ఉంటే ఆయన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పర్యటించగలిగి ఉండేవారు. అందుకు ప్రజలు భాజపా శ్రేణులు కూడా చాలా సంతోషించి ఉండేవారు. దాని వలన పార్టీకి కూడా ఎంతో కొంత మేలు కలిగి ఉండేది. కానీ మోడీ ముఖ్యమంత్రి కెసిఆర్ మాటని కాదనలేకనే వచ్చినట్లుగా మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోతున్నారు. దాని వలన లాభం కంటే ఇటువంటి విమర్శలు వినవలసిరావచ్చు.