టీ-యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్స్ నియామకాలు మూన్నాళ్ళ ముచ్చటేనా?

తెలంగాణలో ఆరు యూనివర్సిటీలకి వైస్-ఛాన్సలర్స్ ని నియమిస్తూ సరిగ్గా నాలుగు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేస్తే, వాటిని హైకోర్టు ఈరోజు రద్దు చేసింది. దానిపై హైకోర్టులో కేసు నడుస్తుండగా ఏవిధంగా నియామకాలు చేస్తారని ఆనాడే హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండేళ్ళు ఆగిన ప్రభుత్వం, తీర్పు చెప్పబోయే మరో రెండు రోజులు ఆగలేదా అని హైకోర్టు ఆనాడే ప్రశ్నించింది. అప్పుడు ప్రభుత్వం తరపున వాదించిన అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు మూడు రోజులు ఆగిన తరువాతే నియామకాలు చేశామని తెలిపారు. అయినప్పటికీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో, కోర్టు తుది ఉత్తర్వుల ప్రకారమే నియమకాలని ఖరారు చేస్తామని తెలిపారు. అప్పుడు హైకోర్టు తన తీర్పుని రిజర్వులో ఉంచింది. కొత్తగా వీసిలుగా నియమితులైన వారందరూ ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని నిన్న కలిసి ధన్యవాదాలు తెలుపుకొని ఆయనతో కలిసి ఫోటోలు కూడా దిగారు. ఈరోజు వారి నియామకాలని రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించడంతో వారి సంతోషం ఆవిరైపోయింది.

తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ అనుమతి తీసుకోకుండా, యుజిసి నిబంధనలకి వ్యతిరేకంగా రాష్ట్రంలోనున్న యూనివర్సిటీలకి వీసీలని నియమించడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల చట్టం-1991కి సవరణలు చేసినప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డా.డి.మనోహర్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సెప్టెంబర్ 11, 2015న హైకోర్టు ఒక పిటిషన్ వేశారు. వీసీల నియామకం పై అప్పటి నుంచి హైకోర్టులో ఆ కేసు నడుస్తోంది. ఆ సంగతి ప్రభుత్వానికి కూడా తెలుసు. అయినప్పటికీ తొందరపడి 6 యూనివర్సిటీలకి వీసీలని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈరోజు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ పి భోస్లే, జస్టిస్ ఏవి శేషసాయిలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన ఆ ఉత్తర్వులని రద్దు చేసింది. దానితో కొత్తగా నియమితులైన వీసీల పరిస్థితి అయోమయంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు వలనే ఈ అవమానకర పరిస్థితి ఎదురైందని చెప్పక తప్పదు.