చుంచుపల్లి కిడ్నీ బాధితుల ఘోడు వినేదెవరు?

వరంగల్ జిల్లాలో మంగపేట మండలంలోని చుంచుపల్లి గ్రామాన్ని గత పదేళ్లుగా కిడ్నీవ్యాదులు పట్టి పీడిస్తున్నాయి. మూడేళ్ళలో ఒక్క చుంచుపల్లి గ్రామానికి చెందినవారే 50 మంది కిడ్నీ జబ్బులతో చనిపోయారు. గత నెల రోజులలో ఆ గ్రామంలో 8 మంది చనిపోయారు. పొరుగునే ఉన్న ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో రోజుకి 15 మంది వరకు డయాలసిస్ చేయించుకొంటున్నారని జిల్లా వైద్యాధికారి స్వయంగా చెప్పారంటే పరిస్థితి తీవ్రతని అర్ధం చేసుకోవచ్చు. చుంచుపల్లి గ్రామంలో సుమారు 450 కుటుంబాలు నివసిస్తుంటే వారిలో ప్రతీ ఇంటికీ కనీసం ఒక్కరైన కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నారు.

భయంకరమైన ఈ కిడ్నీ వ్యాధి బారిన పడుతున్న గ్రామస్తులకి ఆ విధంగా ఎందుకు జరుగుతోందో తెలుసుకోలేక తమ ఊరికి గాలి సోకిందని మంత్రగాళ్ళని ఆశ్రయిస్తున్నారు. అప్పటికీ ఫలితం లేకపోవడం వైద్యం కోసం తమ కొద్దిపాటి ఆస్తిపాస్తులని, చివరికి తమ జీవనాధారమైన పొలాలని, పశువులని కూడా అమ్ముకొని వీధిన పడుతున్నా, వారి రోగం మాత్రం నయం కావడం లేదు. ఈ కిడ్నీ జబ్బు కారణంగా ఉద్యోగాలు, వ్యవసాయం, కూలి పనులు, ఇంటి పనులు చేసుకోలేక గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చివరికి చిన్నారులు కూడా ఈ వ్యాధిబారిన పడుతుండటంతో బడికి వెళ్లి చదువుకోలేకపోతున్నారు. తాము ఎందుకు బడికి వెళ్ళలేకపోతున్నామో, తమకి ఏమయిందో కూడా తెలియని అభం శుభం తెలియని చిన్నారులు బాధతో విలవిలలాడుతున్నారు. ఈ కిడ్నీ జబ్బు కారణంగా గ్రామంలో చాలా మంది పనులు మానుకొని  మంచాలలోనే భారంగా జీవితాలు వెళ్లదీస్తున్నారు. ఈ కారణంగా చుంచుపల్లి గ్రామం పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఈ సమస్య పదేళ్ళ బట్టి ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని, గ్రామస్తులు చెపుతున్నారు. ఈ మద్యన కిడ్నీ సమస్యలు ఇంకా పెరిగిపోయాయని చెపుతున్నారు.

జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయం రాగానే ఆయన తక్షణం జిల్లా వైద్యాధికారులని ఆదేశించడంతో కొన్ని రోజుల క్రితమే, వారు చుంచుపల్లి గ్రామంలో వైద్య శిభిరం నిర్వహించి రోగులకి అవసరమైన వైద్యసేవలు మందులు అందించారు. గ్రామంలో కిడ్నీ బాధితుల వివరాలు, వారి రక్త నమూనాలు, వారు తాగుతున్న నీళ్ళ సాంపిల్స్ అన్నీ సేకరించి హైదరాబాద్ లో పరీక్షలకి పంపామని, ఆ వివరాలు రాగానే ఈ సమస్యకి మూలకారణం ఏమిటో తెలిసే అవకాశం ఉందని, దానిని బట్టి తగు చర్యలు తీసుకొంటామని జిల్లా వైద్యాధికారి చెప్పారు. గ్రామంలో నీటిలో ఫ్లోరైడ్ మరియు హానికారకమైన పదార్ధాల శాతం ఎక్కువగా ఉన్నందునే ఈ సమస్య వస్తున్నట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. ఒకవేళ అదే కారణమని నివేదికలో తెలిస్తే, గ్రామంలో రక్షిత మంచినీటి పధకం ద్వారా శుద్ధినీటి యంత్రాలను ఏర్పాటు చేయాలనుకొంటున్నట్లు ఆయన చెప్పారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే వేరే ప్రాంతాల నుంచి గ్రామానికి సురక్షితమైన మంచి నీళ్ళు అందిస్తామని చెప్పారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలోనే కాకుండా సింగరేణి ఆసుపత్రిలో కూడా చుంచుపల్లి గ్రామస్తులకి ఉచితంగా డయాలసిస్ చేయించడానికి ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని జిల్లా వైద్యాధికారి చెప్పారు.

చుంచుపల్లి గ్రామంలో పదేళ్ళుగా ఈ సమస్య ఉందని తెలిసినా కూడా, ఇంతవరకు కూడా దానికి పరిష్కారం కనుగొనకుండా ప్రభుత్వాధికారులు నిర్లక్ష్యం వహించడం క్షమించరాని నేరమే. వారి నిర్లక్ష్యం కారణంగా ఇంతమంది చనిపోయారు. ఇంకా అనేకమంది కిడ్నీ రోగం బారినపడి దుర్భర జీవితాలు గడుపుతున్నారు. కనీసం ఇప్పుడైనా మేల్కొనకుండా నివేదికలు వచ్చిన తరువాత మంచినీళ్ళు ఏర్పాటు చేస్తామని, డయాలసిస్ ఏర్పాట్లు చేస్తామని చెప్పడం ఇంకా తప్పు. తమ ప్రభుత్వం ప్రజల కోసమే రేయింబవళ్ళు పనిచేస్తోందని గట్టిగా భుజాలు చరుచుకొంటున్న మంత్రులు, నేతలు, అధికారులు ఈ సమస్యని పరిష్కరించలేకపోవడం చాలా శోచనీయం.

నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యని తీర్చలేనప్పుడు. సిరిసిల్ల లో చేనేతన్నల బ్రతుకులు చక్కదిద్దలేనప్పుడు, కరీంనగర్ లో బీడీ కార్మికుల జీవితాలలో వెలుగులు నింపలేనప్పుడు, చుంచుపల్లి గ్రామస్తుల సమస్యని ప్రభుత్వం రాత్రికి రాత్రి మంత్రదండంతో మాయం చేసేస్తుందని ఆశించలేము కనుక ప్రవాసభారతీయులు తలో చెయ్యి వేసి ఈ సమస్యని పరిష్కరిస్తే బాగుంటుంది.