రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలు ఎప్పటికీ తామే అధికారంలో కొనసాగాలనే దురాశతో ప్రతిపక్ష పార్టీలకి చెందిన ఎమ్మెల్యేలని నయాన్నో, భయన్నో తమ పార్టీలలోకి ఫిరాయింపజేసుకొన్నాయి. వారి చేరికల కారణంగా టిడిపి, టిఆర్ఎస్ పార్టీలలో ఉన్న ఎమ్మెల్యేలు చాలా ఆందోళన చెందారు. తమ పార్టీలలోకి కొత్తగా వచ్చేవారికి కూడా 2019 ఎన్నికలలో టికెట్స్ కేటాయించవలసి ఉంటుంది కనుక వారి వలన తాము నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. అప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే మంత్రం పటించడం మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికలలోగా రెండు రాష్ట్రాలలో శాసనసభ నియోజక వర్గాలు పునర్విభజన జరుగుతుందని, దానితో భారీగా శాసనసభ సీట్లు పెరుగుతాయని, కనుక కొత్తవారిని చూసి పాతవారు ఆందోళన చెందనవసరం లేదని నచ్చజెప్పారు. కానీ ఆ విధంగా పార్టీ ఫిరాయించినవారికి ఇప్పుడు బ్యాడ్ న్యూస్ వినవలసి వచ్చింది.
తెదేపా ఎంపి దేవేందర్ గౌడ్ దీని గురించి అడిగిన ఒక ప్రశ్నకి కేంద్ర హోం మంత్రి శాఖ సహాయమంత్రి గంగారాం లిఖిత పూర్వకంగా జవాబిచ్చారు. 2026 వరకు శాసనసభ నియోజక వర్గాల పునర్విభజన చేసి సీట్లు పెంచే ఆలోచన ఏదీ లేదని ఆ లేఖలో తెలిపారు. ఈ లోగా శాసనసభ నియోజక వర్గాల సంఖ్య పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుందని, కానీ కేంద్ర ప్రభుత్వం అటువంటి ఆలోచన ఏదీ చేయడంలేదని స్పష్టం చేశారు.
అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఎన్ని శాసనసభ స్థానాలు ఉన్నాయో వచ్చే ఎన్నికలలో కూడా అన్నే ఉంటాయని, ఒక్క సీటు కూడా అధనంగా పెరగదని స్పష్టం అయ్యింది. కనుక ఇప్పుడు బయట పార్టీల నుంచి టిడిపి, టిఆర్ఎస్ పార్టీలలో చేరినవారికి వచ్చే ఎన్నికలలో తప్పకుండా టికెట్స్ దొరుకుతాయనే నమ్మకం లేదు. ఒకవేళ వాళ్లకి కేటాయిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు కోల్పోతారు. స్వంత పార్టీ ఎమ్మెల్యేలని కాదని బయట నుంచి వచ్చిన వారికి టికెట్స్ కేటాయిస్తే పార్టీలో తిరుగుబాటు జరిగే అవకాశం ఉంటుంది కనుక పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ సీట్లు కేటాయిస్తే అప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దెబ్బయిపోతారు. కనుక ఇకపై ఫిరాయింపులు నిలిచిపోవడమే కాకుండా పార్టీలు మారినవారు వెనక్కి తిరిగి వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు.