కాంగ్రెస్ పార్టీ తెరాసకి కృతజ్ఞతలు చెప్పుకోవాలేమో?

మల్లన్నసాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీకి మంచి రాజకీయ మైలేజ్ నే ఇస్తున్నట్లుంది. తెరాస ఆపరేషాన్ ఆకర్ష్ కి దాదాపు ఖాళీ అయిపోయిన కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఎప్పటికైనా కోలుకొంటుందా, వచ్చే ఎన్నికల నాటికి అసలు మిగిలి ఉంటుందా అని అందరూ భయపడుతున్న సమయంలో, మళ్ళీ దానిలో జోష్ నింపి పోరాటానికి సిద్ధం చేసినందుకు తెరాస ప్రభుత్వానికి, అది చేపట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టుకి, దాని నిర్వాసితులందరికీ కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతలు చెప్పుకోక తప్పదు. విచిత్రమైన విషయమేంటంటే, కాంగ్రెస్ పార్టీని తెరాసయే దెబ్బ తీసింది. మళ్ళీ అదే ఈ విధంగా ఆయువు పోసి నిలబెట్టింది. కనుక కాంగ్రెస్ నేతలు దానిని పైకి విమర్శిస్తున్నప్పటికీ, మనసులో నైనా కృతజ్ఞతలు చెప్పుకోకతప్పదు.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమరోత్సాహంతో ఉరకలు వేస్తోంది. ఇంతవరకు గూటిలో దాక్కొన్న కాంగ్రెస్ నేతలు ఒకరొకరుగా బయటకి వచ్చి తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వారి పోరాటాల వలన నిర్వాసితులకి న్యాయం జరుగుతుందో లేదో ఖచ్చితంగా చెప్పలేము కానీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లేచి నిలబడగలిగిందని చెప్పవచ్చు.

కాంగ్రెస్ నేతలు ‘ఛలో మల్లన్నసాగర్’ పేరిట నిర్వాసితులని కలుసుకోవడానికి నిన్న బయలుదేరినప్పుడు, తెరాస ప్రభుత్వం వారినందరినీ ఎక్కడికక్కడ నిర్బంధించడంతో, వారికి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు మరో అవకాశం కల్పించినట్లయింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, “మల్లన్నసాగర్ ఏమైనా విదేశంలో ఉందా? అది భారత్ లో అంతర్భాగం కాదా? అక్కడికి మేము వెళ్ళకూడదా? మేమేమైనా ఉగ్రవాదులమా..అసాంఘిక వ్యక్తులమా? నిర్వాసితులని కలవడానికి వెళుతుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకొన్నారు? మమ్మల్ని అనుమతించకపోతే మేము రేపు డిజిపిని..ఆయన కూడా అంగీకరించకపోతే జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించైనా సరే మా పోరాటాన్ని కొనసాగిస్తాము,” అని హెచ్చరించారు.

మరో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ “ఆనాడు కెసిఆర్ తెలంగాణ ఉద్యమాలు చేస్తుంటే మేమంతా ఆయనకి సహకరించాము. కానీ ఇప్పుడు మేము ఉద్యమాలు చేస్తుంటే పోలీసుల చేత అరెస్టులు చేయిస్తున్నారు. కెసిఆర్ నిరంకుశ పాలన చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? అనే అనుమానం కలుగుతోంది,” అని అన్నారు.

కాంగ్రెస్ నేతల మాటల్లో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల గురించి ఆవేదన కనబడటం లేదు. తెరాస ప్రభుత్వాన్ని ఏ విధంగా ఢీ కొనాలా అనే తపన మాత్రమే ప్రస్పుటంగా కనబడుతోంది. అందుకే మనవ హక్కుల సంఘం ప్రసక్తి తెచ్చారనుకోవాలి. ఇంతకీ మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకి న్యాయం చేసేది తెరాస ప్రభుత్వమా లేక ప్రతిపక్ష పార్టీలా అనేది చూడాలి.