తెలంగాణ రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై తెరాస నేతలు మళ్ళీ విమర్శలు మొదలుపెట్టారు. ఆయన మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకి సంఘీభావం ప్రకటించి, వారిపై పోలీసుల లాఠీ ఛార్జ్ చేయడాన్ని ఖండించారు. అంతేగాక ప్రాజెక్టులలో లోటుపాట్లని, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అవినీతి ఆరోపణలలో నిజానిజాలు తెలుసుకోవడానికి ఆయన స్వయంగా రెండు రోజులు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకొని, దానినే మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేశారు.
ఆయన చర్యలన్నీ తెరాస ప్రభుత్వానికి, ఆ పార్టీకి కూడా తీవ్ర ఆగ్రహం కలిగించేవే. కానీ ఇదివరకు ఆయనపై తెరాస మంత్రులు, నేతలు అందరూ మూకుమ్మడిగా తీవ్ర విమర్శలు చేసినందుకు, తెరాస ప్రభుత్వంపై రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి ప్రతి విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. రాజకీయాలకి అతీతంగా ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వ తపొప్పులని ఎత్తి చూపుతుంటే వాటిని సవరించుకోకపోగా, తిరిగి ఆయనపై ఎదురుదాడి చేసి ఆయన గొంతు నొక్కే ప్రయత్నం చేయడం చాలా తప్పని చాలా మంది ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కారణంగానే ఇన్ని రోజులుగా ఆయనని విమర్శించడానికి తెరాస నేతలు వెనుకాడారు.
కానీ తెలంగాణ ప్రజలలో మంచి పేరు, గౌరవం కలిగిన ప్రొఫెసర్ కోదండరాం రాజకీయాలకి అతీతంగా తమ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలని తెలంగాణ ప్రజలని చాలా ఆలోచింపజేస్తాయని తెరాస గ్రహించినందునే, ఆయనని కూడా ధీటుగా ఎదుర్కోక తప్పదని నిశ్చయించుకొన్నట్లు తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి విమర్శలు స్పష్టం చేస్తున్నాయి.
ఆయన బుధవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “ప్రొఫెసర్ కోదండరాం వంటి మేధావి కూడా సాగునీటి ప్రాజెక్టుల గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా దొంగలు వంటి ప్రతిపక్ష పార్టీలతో కలిసి మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా అప్పుడు ఎవరూ వారిని ప్రశ్నించలేదు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం బీడు భూములకి నీళ్ళు పారించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ప్రయత్నిస్తుంటే ప్రొఫెసర్ కోదండరాం వంటి వారు కూడా అడ్డుపడుతుండటం, మాపై విమర్శలు చేయడం చాలా బాధ కలిగిస్తోంది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకి జవాబు చెప్పేందుకు త్వరలోనే కల్వకుర్తి నుంచి ప్రాజెక్టుల యాత్ర మొదలు పెడతాము,” అని నిరంజన్ రెడ్డి ప్రకటించారు.