ఏపి ప్రభుత్వానికి, తెదేపా నేతలకి హరీష్ రావు చురకలు

మల్లన్నసాగర్ భూసేకరణని వ్యతిరేకిస్తున్న తెదేపా నేతలకి, వారితో పాటు ఏపి ప్రభుత్వానికి కూడా మంత్రి హరీష్ రావు చురకలు..కాదు ఏకంగా వాతలే పెట్టారు. ఏపిలో రాజధాని, దాని చుట్టూ రింగ్ రోడ్డు, గన్నవరం విమానాశ్రయం, మచిలీపట్నం ఓడరేవు, ఎస్.ఈ.జెడ్.ల పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్షల ఎకరాలు సేకరిస్తోంది. అవి కూడా ఏడాదికి మూడు పంటలు పండే మంచి పంట భూములు. రైతులు వ్యతిరేకిస్తున్నా, బాధపడుతున్నా ఏపి ప్రభుత్వం బలవంతంగా గుంజుకొంటోంది. అమరావతి కోసం ఏకంగా 54,000 ఎకరాలు సేకరించింది. అమరావతిలో అసెంబ్లీ, సచివాలయం వగైరా నిర్మించుకోవడానికి 500 ఎకరాలు సరిపోవా? 54,000 ఎకరాలు ఎందుకు సేకరించింది? ఇక్కడ మమ్మల్ని ప్రశ్నిస్తున్న తెదేపా నేతలు అక్కడ ఎందుకు ప్రశ్నించడం లేదు? అని అడిగారు.

“అక్కడి ప్రభుత్వం పచ్చటి పంటలు పండే భూములని గుంజుకొని దానిపై పరిశ్రమలు కట్టాలని చూస్తోంది. కానీ ఇక్కడ మేము ఎండిపోయిన బీడు భూములకి నీళ్ళు అందించి పంటలు పండించుకోవడానికి కొద్దిపాటి భూమిని సేకరిస్తున్నాము. అది కూడా తెదేపా నేతలకి తప్పుగానే కనబడుతోంది. ఇక్కడ తప్పుగా అనిపించినప్పుడు ఏపిలో తెదేపా ప్రభుత్వం చేస్తున్నదేమిటి? దీనికి తెదేపా నేతలు సమాధానం చెప్పాలి,” అని హరీష్ రావు కోరారు.  

మల్లన్నసాగర్ లో భూసేకరణ చట్టాన్ని అమలుచేయాలని కోరుతున్న తెదేపా నేతలకి హరీష్ రావు సూటిగా మరో ప్రశ్న వేశారు. “కేంద్రమంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు ఇద్దరూ మంత్రివర్గ సమావేశంలో భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతారు. ఆ పార్టీ ఎంపీలు కూడా లోక్ సభలో భూసేకరణ చట్టానికి వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ తెదేపా నేతలు మాత్రం అదే భూసేకరణ చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలని డిమాండ్ చేస్తుంటారు. ఢిల్లీలో ఒకలాగ, గల్లీలో మరొకలాగ మాట్లాడటం వారికే చెల్లుతుంది,” అని హరీష్ రావు విమర్శించారు.