ప్రాజెక్టుల రీడిజైనింగ్ సరైన నిర్ణయమే: హరీష్ రావు

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లలో మార్పులు చేర్పులు చేయడం ద్వారా వాటి అంచనా వ్యయాలు గణనీయంగా పెంచేసి తెరాస నేతలు జేబులు నింపుకొంటున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. వాటికి మంత్రి హరీష్ రావు ధీటుగా సమాధానం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మా ప్రభుత్వం సాగునీటి రంగంలో నిపుణులు, ఇంజనీర్లతో కలిసి అనేక రోజుల పాటు సుధీర్గంగా చర్చలు జరిపి, వాటిపై లోతుగా అధ్యయనం చేసిన తరువాతే డిజైన్లలో మార్పులు చేర్పులు చేశాము తప్ప ఏదో ఆషామాషీగా చేయలేదు. దాని కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా చాలా కష్టపడ్డారు. ప్రాజెక్టుల కోసం అతి తక్కువ భూసేకరణ చేసి, వీలైనంత ఎక్కువ నీళ్ళు స్టోరేజి చేసేందుకే ప్రాజెక్టులని రీడిజైన్ చేశాము తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు.

“ఉదాహరణకి 45 టి.ఎం.సి.ల స్టోరేజ్ సామర్ధ్యం కలిగిన పులి చింతల ప్రాజెక్టు క్రింద 28 గ్రామాలు ముంపుకి గురయితే, వెల్లంపల్లి ప్రాజెక్టు (20 టి.ఎం.సి.లు) క్రింద 21 గ్రామాలు, మిడ్ మానేరు ప్రాజెక్టు (25 టి.ఎం.సి.లు) క్రింద 18 గ్రామాలు, మల్లన్నసాగర్ (50 టి.ఎం.సి.లు) దాని క్రింద కేవలం 8 గ్రామాలు మాత్రమే ముంపుకి గురవుతాయి. అదే విధంగా ఇదివరకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు (115 టి.ఎం.సి.లు) గీసిన డిజైన్ ప్రకారం 32 గ్రామాలు ముంపుకి గురయ్యేవి. కానీ మేము దానిని రీడిజైన్ చేసి (92 టి.ఎం.సి.లు) ముంపు గ్రామాల సంఖ్యని 6కి తగ్గించాము,” అని హరీష్ రావు వివరించారు.

మనం నీళ్ళ కోసమే కోట్లాది తెలంగాణ సాధించుకొన్నాము. కనుక ఆ నీళ్ళని రాష్ట్రమంతటా పారించి పంటలు పండించాలని పట్టుదలగా సాగునీటి ప్రాజెక్టులు కడుతుంటే, ప్రతిపక్ష పార్టీలు వాటికి అడ్డం పడుతున్నాయి,” అని మంత్రి హరీష్ రావు విమర్శించారు.