దేవుడికే శఠగోపం పెట్టడం అంటే ఇదేమరి. ఓ పక్క కార్బైడ్ తో పండ్లను పండించిన వాళ్లను ఉగ్రవాదుల కన్నా హీనంగా చూసిన న్యాయమూర్తులకే కార్బైడ్ పళ్లు పంపడం చర్చనీయాంశంగా మారింది. తమకు ఎదురైన చేదు అనుభవాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి భోస్లే, న్యాయమూర్తి ఏవీ శేషసాయితో కూడిన డివిజన్ బెంచ్ తెలిపింది. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ పండ్ల వ్యాపారి నుండి పండ్లు కొనుగోలు చేశాక వారికి అనుమానం కలిగింది. దాంతో వారు రకరకాల పరీక్షలు నిర్వహించారు. వారికి షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
న్యాయమూర్తులు మొత్తం ఆరు రకాల పండ్లను కొంటే వాటిలో మూడు రకాల పండ్లు తినేందుకు కూడా పనికిరానంతగా కెమికల్స్ తో కలిసిపోయాయని తేలింది. వాటిని తింటే డబ్బులిచ్చి మరీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న వాళ్లవుతారు అని తెలిసింది. కార్బైడ్ వాడకంపై దాఖలైన పిల్ పై వారు విచారిస్తూ ఈ విషయాలను వెల్లడించారు. కార్బైడ్ రహిత పండ్లను మాత్రమే వ్యాపారులు అమ్మేలా చర్యలకు దిగాలని ప్రభుత్వానికి బెంచ్ సలహానిచ్చింది.