కాంగ్రెస్, టిఆర్ఎస్ ల మల్లయుద్ధం దేనికంటే?

తెలంగాణలో ఇప్పుడు చాలా హాట్ సబ్జెక్ట్ ఏది అంటే ‘మల్లన్నసాగర్ ప్రాజెక్టు’ అని చెప్పకతప్పదు. దానిపై టిఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది. “ఛలో మల్లన్నసాగర్” పేరిట అక్కడికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలందరినీ ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తుండటంతో వారి మల్లయుద్ధం క్లైమాక్స్ కొచ్చేసినట్లే కనిపిస్తోంది. అసలు వాళ్ళు ఎందుకు యుద్ధం చేస్తున్నారు? దానిలో ఎవరు గెలుస్తారు? అనే రెండు ప్రశ్నలకు, రెండు రకాల జవాబులు వినిపిస్తున్నాయి.    

ఈ ప్రాజెక్టు ఎందుకు నిర్మిస్తున్నారంటే జిల్లాలో లక్షల ఎకరాలకి నీళ్ళు అందించడం కోసమేనని ప్రభుత్వం చెబుతోంటే, కాదు జేబులు నింపుకోవడానికేనని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే 1.5 టి.ఎం.సి. నిలువ సామర్ధ్యం గల ఈ ప్రాజెక్టుని ఒకేసారి ఏకంగా 50 టి.ఎం.సి. ప్రాజెక్టుగా పెంచేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇక ఎందుకు యుద్ధం చేస్తున్నాయంటే, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో కూడా ప్రతిపక్ష పార్టీలు చాలా లోపాలు ఎత్తి చూపిస్తున్నాయి. అవినీతి, నిర్వాసితుల సమస్యలు, సాంకేతిక సమస్యలు వగైరా అన్న మాట! కనుక ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకి, పోరాటాలకి భయపడి ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గినట్లయితే, వాటి ఆరోపణలని అంగీకరించినట్లే అవుతుంది. ఆ ప్రాజెక్టు గురించి తన ఆలోచనలు, లెక్కలు అన్నీ తప్పని అంగీకరించినట్లే అవుతుంది. ఈ ప్రాజెక్టుని ముంపు గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే ప్రతిపక్షాల వాదనని కూడా అంగీకరించినట్లే అవుతుంది. తద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందనే వాటి వాదనలని కూడా అంగీకరించినట్లే అవుతుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని భావించవచ్చు.

తెరాస ధాటికి రాష్ట్రంలో నుంచి ప్రతిపక్షాలు క్రమంగా తుడిచిపెట్టుకుపోతున్న కారణంగా అవి తమ మనుగడని కాపాడుకోనేందుకే ఇంతగా పోరాడుతున్నాయని భావించక తప్పదు. ప్రాజెక్టులలో అవినీతి జరుగుతోందని వాదిస్తున్నాయి కానీ వాటిని సాక్ష్యాధారాలతో నిరూపించి చూపలేకపోవడం గమనిస్తే, అవి తమ మనుగడ కోసమే యుద్ధానికి దిగాయని అర్ధం అవుతుంది. ముంపు ప్రాంతాలలో గ్రామస్తులు తమ భూములు కోల్పోతున్నారు కనుక వారు చాలా ఆందోళనకి గురయ్యి ఉంటారు. కనుక ఇటువంటి ఆపత్కాలంలో వారికి అండగా నిలబడితే, ప్రజలు తమని గుర్తిస్తారనే ఆశతో, ఆలోచనతోనే ప్రతిపక్షాలు పోరాడుతున్నట్లు భావించవచ్చు. మరి ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారంటే మాత్రం ప్రభుత్వమేనని చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా గ్రామాలలో రిజిస్ట్రేషన్లు పూర్తయిపోయాయి. భూసేకరణ ప్రక్రియ పూర్తయితే ఇక ప్రతిపక్ష పార్టీలు చేయగలింది ఏమీ ఉండదు. ఏపి లో రాజధాని కోసం అక్కడి ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ విజయవంతం కావడమే అందుకు చక్కటి ఉదాహరణ.