తెలంగాణ న్యాయవాదులు చేసిన పోరాటం కారణంగా హైకోర్టు విభజనకి మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. దాని కోసం గవర్నర్ నరసింహన్ చొరవ తీసుకొని ఏపి సిఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడగా ఆయన షెడ్యూల్: 9, 10ల క్రింద ఉండే సంస్థల విభజనకి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సహకరిస్తే, హైకోర్టు విభజనకి తాను సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తరువాత గవర్నర్ నరసింహన్ కెసిఆర్ తో కూడా సమావేశం అవడం, నిన్న డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలవడం అందరికీ తెలుసు.
టిడిపికి అ(న)ధికార మీడియాగా పేరు పొందిన ఆంధ్రజ్యోతిలో ఈ పరిణామాల గురించి ఈ రోజు ఒక ఆసక్తికరమైన వార్త వేసింది. హైకోర్టు విభజన కోసం గవర్నర్ ఒక ప్రతిపాదన చేసినట్లు పేర్కొంది. దాని ప్రకారం, అమరావతిలో ఏపి హైకోర్టు కోసం తాత్కాలికంగా ఒక భవన సముదాయాన్ని ఏపి ప్రభుత్వం నిర్మిస్తుంది. దానికి అవసరమైన నిధులు మొత్తం కేంద్ర ప్రభుత్వమే అందించాలి. 2016 లోగానే హైకోర్టు భవన నిర్మాణం, అక్కడ హైకోర్టు ఏర్పాటుకి అవసరమైన ఏర్పాట్లు, తరలింపు ప్రక్రియని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి చేయాలి. ఆ లోగానే షెడ్యూల్: 9, 10ల క్రింద ఉండే సంస్థల విభజనకి కెసిఆర్ అన్ని విధాల సహకరించి ఆ ప్రక్రియని పూర్తి చేయాలి అనేది క్లుప్తంగా గవర్నర్ ప్రతిపాదన.
ఈ ప్రతిపాదనకి ఇరువురు ముఖ్యమంత్రులు అంగీకరించారు కనుకనే గవర్నర్ నిన్న ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సమస్యలన్నీ పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారాయి కనుక అవి పరిష్కారం అవుతాయంటే తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం వెనుకాడకపోవచ్చు.
ఆగస్ట్ 7న ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా తెలంగాణ పర్యటనకి వస్తున్న సందర్భంగా హైకోర్టు విభజనపై నిర్దిష్టమైన ప్రకటన చేయవచ్చని సమాచారం. ఒకవేళ హైకోర్టు విభజన జరగడం ఖాయమైతే ఈ సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకొన్న గవర్నర్ నరసింహన్ని అభినందించవలసిందే. అలాగే దానిని కూడా పోరాడి సాధించుకొన్నతెలంగాణ న్యాయవాదులకే ఆ క్రెడిట్ దక్కుతుంది.