కేసీఆర్ చేతులు కాల్చుకుంటున్నాడా?

గతమెంతో ఘనం అని ఎవరు చెప్పినా దానికి అందరూ అవుననే ఊ కొడతారు. టిఆర్ఎస్ పార్టీతో తెలంగాణ ఉద్యమానికి ఊపుతెచ్చిన నాయకుడిగా కేసీఆర్ కు గుర్తింపు ఉంది. తెలంగాణ కలను సాకారం చేయడంలో ఆయన ఎంతో కీలకమైన పాత్రను పోషించాడు అనే దాంట్లో ఎలాంటి అనుమానాలు లేవు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బంగారు తెలంగాణ అంటూ అధికార పీఠం ఎక్కిన కేసీఆర్, ఇప్పటికి రెండు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. గతంలో కేసీఆర్ కు జైకొట్టిన జనం.. ఎప్పటికీ జై కొట్టాలంటే కుదరదు. 

తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మల్లన్న సాగర్ ప్రభుత్వానికి గుదిబండగా మారింది. కేసీఆర్ దూకుడు చూసిన వాళ్లెవరైనా చెప్పేమాట ఆయన తలుచుకుంటే మాత్రం వెంటనే చేస్తారు అని, కానీ మల్లన్నసాగర్ విషయంలో మాత్రం అది కుదరడం లేదు. అది కేవలం భూసేకరణ వరకు మాత్రమే పరిమితమైంది. ప్రత్యేక రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు, ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు, సమ్మెలు, బంద్ లు ఉండవు అని నాడు కేసీఆర్ ఘనంగా ప్రకటించారు. 

ఐదేళ్ల తన ప్రభుత్వ హయాంలో తెలంగాణ లోని కోటి ఎకరాలకు నీళ్లు అందిస్తాం అన్న కేసీఆర్ హామీ నిజంగా నెరవేరుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం దేన్నైతే ఛాలెంజింగ్ గా తీసుకుందో అదే మల్లన్న సాగర్ వల్ల ఉద్రిక్తత నెలకొంది. రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుండటం.. అదే టైంలో పోలీసుులు వారిపై లాఠీలు ఝులిపించడం కేసీఆర్ సర్కార్ కు తీవ్ర నష్టాన్ని కలిగించకమానదు. గత రెండేళ్ల నుండి జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వచ్చిన కేసీఆర్ ఇప్పుడు తప్పటడుగు వేస్తున్నాడా అని విశ్లేషకులు చర్చిస్తున్నారు. 

తనను తాను మోనార్క్ గా అభివర్ణించుకునే కేసీఆర్ మల్లన్నసాగర్ మాత్రం చురకలంటించింది. రైతులు, పేదలు మల్లన్నసాగర్ కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి దిగుతున్నారు. ఇక ఉండీలేనట్లు ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు అప్పుడప్పుుడు మీడియాలో మెరుస్తూ... వీరికి సానుభూతి పలుకుతున్నారు. కాగా తెలంగాణ ఏర్పడ్డాక బ్రతుకులు బంగారమవుతాయి అని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి రాగానే రైతులపై లాఠీలతో కొట్టించి.. తన చేతులను తానే కాల్చుకున్నాడా.? అంటే అవును అనే సమాధానమే వస్తుంది. ఇది గనక ఇలాగే సాగితే ప్రజలు కేసీఆర్ కు మరో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవలసి వస్తుంది.