టిఆర్ఎస్, బిజెపిల మద్య దోస్తీ కుదురుతోందా?

తెలంగాణలో కాంగ్రెస్, తెదేపాలు మల్లన్నసాగర్ ప్రాజెక్టుని గట్టిగానే వ్యతిరేకిస్తున్నాయి, కానీ బిజెపి మాత్రం కొంచెం మెతక వైఖరి అవలంభిస్తోంది. ఇటువంటి వ్యవహారాలకి ఎపుడూ దూరంగా ఉండే వైసిపి కూడా స్పందించింది. అప్పుడే బిజెపి ఇక తప్పదన్నట్లుగా రంగంలోకి దిగింది.

ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “మల్లన్నసాగర్ ప్రాజెక్టుకి సమగ్ర నివేదిక లేకుండానే, దానిని 50 టి.ఎం.సి.ల సామర్ధ్యంతో నిర్మించాలని ఎందుకు నిర్ణయించుకొంది? అది ఎవరి ప్రయోజనం కొరకు? ప్రజల కోసమేనా లేకపోతే కొందరి జేబులు నింపడం కోసమా?” అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అండ చూసుకొని తెరాస నేతలు చాలా రెచ్చిపోతున్నారని ఆరోపించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర  ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు మెదక్ జిల్లాలో అన్ని మండలాలలో ధర్నాలు నిర్వహించాలని భాజపా కార్యకర్తలకి పిలుపునిచ్చారు.

డా.లక్ష్మణ్ విమర్శలని బట్టి చూసినట్లయితే, తెరాసని భాజపా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు కెసిఆర్ ని, ఆయన చేపడుతున్న ప్రాజెక్టులని చాలా మెచ్చుకొంటుంటారు. ఆయన కూడా వారితో చాలా సఖ్యతగానే మసులుకొంటారు. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ నిన్న హైదరాబాద్ వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయనకి విందు భోజనం ఏర్పాటు చేశారు. అరుణ్ జైట్లీ కూడా కెసిఆర్ పాలనని, పథకాలని చాలా మెచ్చుకొన్నారు. ఇదివరకు తమిళనాడులో అన్నాడిఎంకెతో పొత్తుల కోసం మోడీతో సహా కేంద్రమంత్రులు ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత చుట్టూ ఇలాగే ప్రదక్షిణాలు చేయడం గుర్తుతెచ్చుకొంటే, ఇప్పుడు కెసిఆర్ తో కేంద్రప్రభుత్వం అంత మంచిగా, మృదువుగా ఎందుకు వ్యవహరిస్తోందో అర్ధం అవుతుంది.   

ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు కెటిఆర్ కూడా తరచూ ఢిల్లీ వెళ్లివస్తూనే ఉంటారు. ఆయనతో కూడా కేంద్రమంత్రులు అదే గౌరవమర్యాదలతో వ్యవహరిస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులని అందరూ మెచ్చుకొంటూనే ఉంటారు. రాష్ట్ర బిజెపి నేతలు మాత్రం అదే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు కానీ చాలా ఆచి తూచి! ఏపిలో తెదేపాతో ఏవిధంగా వ్యవహరించాలో తెలియక తికమక పడుతున్న బిజెపి, తెలంగాణలో టిఆర్ఎస్ పట్ల మృదువుగా వ్యవహరిస్తున్న తీరు గమనిస్తే, టిఆర్ఎస్ తో తన సంబంధాల గురించి చాలా క్లారిటీ కలిగి ఉన్నట్లే కనిపిస్తోంది. అవసరం, అవకాశం కలిసి వస్తే మున్ముందు ఏదో ఒకరోజు బిజెపి. టిఆర్ఎస్ చేతులు కలిపే అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది.

రాష్ట్ర బిజెపి నేతల విమర్శలని టిఆర్ఎస్ కూడా పట్టించుకోకపోవడం గమనిస్తే, అది కూడా బిజెపితో చేతులు కలిపేందుకు ఆసక్తిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ విషయం గురించి ఆలోచించడానికి ఇంకా చాలా సమయం ఉంది కనుక ప్రస్తుతానికి ఏదో మొక్కుబడిగా ఫైట్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నట్లున్నాయి. బహుశః ఎన్నికలకి ముందు అవి చేతులు కలుపుతాయేమో?